రైతు బిడ్డను పెళ్లాడితే 2లక్షలు ఆర్థిక సాయం..

రైతు కొడుకు అనే కారణంగా ఇటీవల చాలామంది యువకులు వివాహం కాకుండా ఒంటరిగా మిగిలిపోతున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు కుమారస్వామి. వారికోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

Advertisement
Update:2023-04-11 16:45 IST

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కర్నాటకలో అభ్యర్థుల ఎంపిక జోరందుకుంది. అంతకంటే ఎక్కువగా హామీలపై దృష్టి పెట్టాయి పార్టీలు. అధికారాన్ని నిలబెట్టుకోడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్ కూడా శక్తి వంచన లేకుండా హామీలు గుప్పిస్తున్నాయి. తాజాగా జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి ఇచ్చిన హామీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు తావిచ్చింది. ఆయన ఇచ్చిన హామీని స్వాగతిస్తున్నవారితోపాటు, విమర్శిస్తున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

కర్నాటకలో జేడీఎస్ అధికారంలోకి వస్తే, రైతుల కొడుకులను పెళ్లాడిన యువతులకు 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామన్నారు కుమారస్వామి. అయితే రైతు కొడుకులు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నా కూడా ఈ ఆర్థిక సాయం ఇస్తారా లేక, వారు కూడా రైతులే అయి ఉండాలా అనే దానిపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. రైతు కొడుకుల్ని పెళ్లాడిన అమ్మాయిలకు 2 లక్షలు ఆర్థిక సాయం ఇస్తామని మాత్రం ప్రకటించారు.

కోలార్‌ లో జరిగిన 'పంచరత్న' ర్యాలీలో పాల్గొన్న కుమారస్వామి ఈమేరకు ఎన్నికల హామీ ఇచ్చారు. రైతు బిడ్డల పెళ్లిళ్లను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రైతు కొడుకు అనే కారణంగా ఇటీవల చాలామంది యువకులు వివాహం కాకుండా ఒంటరిగా మిగిలిపోతున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు కుమారస్వామి. వారికోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ ప‌థకం అమ‌లు చేయడం ద్వారా రైతు బిడ్డల ఆత్మ గౌర‌వాన్ని కాపాడ‌వ‌చ్చ‌ని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News