ఎన్నికల వేళ భారీగా నగదు, బంగారం స్వాధీనం

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారీగా నగదు, బంగారం పట్టుబడిన ఘటన కర్నాటకలో కలకలం రేపింది.

Advertisement
Update:2024-04-08 11:56 IST

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారీగా నగదు, బంగారం పట్టుబడిన ఘటన కర్నాటకలో కలకలం రేపింది. బళ్లారిలో హవాలా కార్యకలాపాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం రావడంతో రంగంలోకి దిగిన బ్రూస్‌పేట్‌ పోలీసులు ఒక వ్యాపారి ఇంట్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో అక్రమ నగదు, బంగారం, వంద కేజీలకు పైగా వెండి బయటపడింది.

బళ్లారిలోని ఆభరణాల వ్యాపారి నరేశ్‌ సోనీ ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసులు రూ.7.6 కోట్ల నగదు, బంగారు, వెండి ఆభరణాలను గుర్తించారు. వాటిలో లెక్కల్లోకి రాని భారీ నగదు, ఆభరణాలు భారీ స్థాయిలో ఉండటాన్ని గుర్తించిన పోలీసులు రూ.5.6 కోట్ల కరెన్సీ, 103 కిలోల వెండి ఆభరణాలు, 68 వెండి కడ్డీలు, 3 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.

లెక్కలో లేని ఈ నగదు, ఆభరణాలను హవాలా మార్గంలో తీసుకొచ్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే కోణంలో దర్యాప్తు కూడా చేపట్టారు. సోదాల అనంతరం వ్యాపారి నరేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ వివరాలను ఆదాయపు పన్ను విభాగానికి అందజేస్తామని, అనంతరం ఐటీ అధికారులు దీనిపై తదుపరి విచారణ చేపడతారని పోలీసులు వెల్లడించారు. కర్నాటకలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు రెండు దశల్లో ఏప్రిల్‌ 26, మే 4వ తేదీన పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ దగ్గరపడుతున్న వేళ ఈ ఘటన వెలుగుచూడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Tags:    
Advertisement

Similar News