ఆదోని, ఆలూరును కర్నాటకలో కలపాలి- ఎమ్మెల్యే సోమలింగప్ప

ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, ఆదోని ప్రాంతాలు గతంలో కర్నాటకలోని బళ్లారి జిల్లాలోనే ఉండేవి. ఈ ప్రాంతాల్లోని యాస, సంస్కృతి కూడా ఏపీకి కాస్త భిన్నంగానే ఉంటుంది.

Advertisement
Update:2022-12-25 08:46 IST

ఇప్పటికే మహారాష్ట్రతో సరిహద్దు వివాదం పతాక స్థాయికి చేరిన నేపథ్యంలో కర్నాటక ఎమ్మెల్యే ఏపీలోని కొన్ని ప్రాంతాలనూ కర్నాటకలో కలపాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలోనూ వినిపించింది.

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆలూరు, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల్లోని 40 గ్రామాలు కర్నాటక సరిహద్దుల్లో ఉన్నాయి. వాటిని కర్నాటకలో కలిపేలా చర్యలు తీసుకోవాలని కర్నాటకలోని బళ్లారి జిల్లా శిరగుప్ప ఎమ్మెల్యే సోమలింగప్ప ఆ రాష్ట్ర శాసనసభలోనే డిమాండ్ చేశారు. మరీ ముఖ్యంగా విద్యపరంగా ఆ గ్రామాలను కర్నాటకలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. 40 గ్రామాల్లో గతంలో 12వేల మందికిపైగా పిల్లలు కన్నడ విద్యను చదివేవారని.. ఇప్పుడు ఆ సంఖ్య 8వేలకు పడిపోయిందన్నారు. అక్కడ కన్నడ ఉపాధ్యాయుల కొరత కూడా ఉందన్నారు. కాబట్టి అక్కడ కన్నడ భాషను కాపాడుకోవాలంటే ఆ గ్రామాలను కర్నాటకలోకి కలుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా కర్నాటక ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టాలని ఎమ్మెల్యే సోమలింగప్ప కోరారు.

ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, ఆదోని ప్రాంతాలు గతంలో కర్నాటకలోని బళ్లారి జిల్లాలోనే ఉండేవి. ఈ ప్రాంతాల్లోని యాస, సంస్కృతి కూడా ఏపీకి కాస్త భిన్నంగానే ఉంటుంది. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్ తిక్కారెడ్డి కూడా ఈ ప్రాంతాలను కర్నాటకలో కలపాలని డిమాండ్ చేశారు. ఆదోని కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని.. లేని పక్షంలో తమను కర్నాటకలో కలపాలని డిమాండ్ చేశారు. సరిహద్దుల్లో ఉన్న తమ ప్రాంతాలను కర్నాటకలో కలిపితే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అప్పట్లో టీడీపీ నేత తిక్కారెడ్డి డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News