జయలలిత అక్రమ ఆస్తుల విక్రయానికి ఏర్పాట్లు.. - ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం
1996 నాటి జయలలిత అక్రమ ఆర్జన కేసును సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 2003లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ చేశారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమ ఆస్తులను విక్రయించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా న్యాయవాది కిరణ్ ఎస్ జావలిని నియమించింది. ఈ విక్రయాలను ఆయన పర్యవేక్షణ చేయనున్నారు. ఇప్పుడు విక్రయించాలనుకుంటున్నవన్నీ చరాస్తులే కావడం గమనార్హం.
1996 నాటి జయలలిత అక్రమ ఆర్జన కేసును సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 2003లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా సాక్ష్యాల రూపంలో 1996లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు ఇప్పుడు కర్ణాటక ఆధీనంలో ఉన్నాయి.
వాటిని ఇప్పుడు వేలం వేసేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించింది. ప్రస్తుతం కర్ణాటక ఆధీనంలో ఉన్న ఆస్తులు ఏమిటంటే.. బంగారు, వజ్రాభరణాలు 7 కిలోలు, వెండి ఆభరణాలు 600 కిలోలు, 11 వేలకు పైగా చీరలు, 750 జతల చెప్పులు / బూట్లు, 91 వాచీలు, 131 సూట్ కేసులు, 1040 వీడియో క్యాసెట్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు, విద్యుత్ పరికరాలు.. వాటిలో ఉన్నాయి.