అప్పుడు 'పే సీఎం'.. ఇప్పుడు 'పే ఫార్మర్'..
'పే ఫార్మర్' అంటూ కర్నాటక రైతులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. చెరకు పంటకు రూ.4,500 మద్దతు ధర కల్పించాలని ఆ రాష్ట్ర రైతులంతా కలిసి 'పే ఫార్మర్' ఆందోళన చేపట్టారు.
ఆందోళన, నిరసన కార్యక్రమాలతో ఇటీవల పేటీఎం మనీ ట్రాన్స్ ఫర్ యాప్ కి విపరీతమైన ప్రచారం లభిస్తోంది. ఏపీలో 'భారతి'పే అంటూ సీఎం జగన్ సతీమణిపై కూడా టీడీపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అయితే పేటీఎం తో ఎక్కువగా అవమానాలు ఎదుర్కొంటున్న నాయకుడు కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై. అవును పేటీఎం అంటేనే ఆయన గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అంతలా ఆయన్ను పేటీఎం పేరుతో చికాకు పెడుతున్నారు.
కర్నాటకలో ఏ కాంట్రాక్ట్ చేపట్టాలన్నా లంచం సమర్పించుకోవాల్సిందేనంటూ స్వయంగా కాంట్రాక్టర్లే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 'పే సీఎం' పేరుతో వారు సీఎం బసవరాజ్ బొమ్మై పోస్టర్లు వేసి ఓ ఆట ఆడేసుకున్నారు. క్యూఆర్ కోడ్ తో కూడిన బొమ్మలు వేసి బొమ్మై పరువు తీసేశారు. ఈ ఫొటోలు వేసిన కాంగ్రెస్ నాయకులపై కర్నాటక ప్రభుత్వం కేసులు పెట్టింది కూడా. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మరోసారి పేటీఎం తరహా సెటైర్లు మొదలయ్యాయి. ఈసారి విపక్షాలు కాదు, నేరుగా రైతులు రంగంలోకి దిగారు. 'పే ఫార్మర్' అంటూ వారు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. చెరకు పంటకు రూ.4,500 మద్దతు ధర కల్పించాలని ఆ రాష్ట్ర రైతులంతా కలిసి 'పే ఫార్మర్' ఆందోళన చేపట్టారు.
ప్రస్తుతం కర్నాటకలో టన్ను చెరకు ధర రూ.2,500 నుంచి రూ.2,800 మధ్యలో ఉంది. దీంతో రైతులకు పెట్టుబడి సొమ్ము కూడా తిరిగి రావడంలేదు. కనీస మద్దతు ధర అమలు చేస్తేనే తాము ఒడ్డునపడతామని చెబుతున్నారు రైతులు. కర్నాటక రాజ్య రైతు సంఘం నాయకుడు దర్శన్ పుట్టణ్ణయ్య నాయకత్వంలో 'పే ఫార్మర్' ఆందోళనలు మొదలయ్యాయి. 'పే ఫార్మర్' యాక్సెప్టెడ్ హియర్ రూపీస్ 4,500 పర్ టన్ ఫర్ షుగర్ కేన్.. అనే పదాలతో తలపాగా చుట్టుకున్న రైతు బొమ్మ ఉంచి పక్కనే క్యూఆర్ కోడ్ ప్రింట్ చేశారు. ఈ వాల్ పోస్టర్లు రాష్ట్రమంతా అంటిస్తున్నారు. పల్లెల్లో ఈ పోస్టర్లతో ఊరేగింపులు చేపట్టి నినాదాలు చేస్తున్నారు రైతులు. కర్నాటకలో 71 చక్కెర మిల్లులు ఉండగా, వీటిలో అత్యధిక కర్మాగారాలు బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి బంధువులవే కావడం విశేషం. అందుకే వారు చెరకు కొనుగోలు ధర పెంచేందుకు ఒప్పుకోవడంలేదు. మద్దతు ధరపై ప్రకటన ఇస్తే వారి ఆగ్రహానికి గురవుతామనే అనుమానంతో బొమ్మై కూడా రైతుల సమస్యపై స్పందించటం లేదు. చెరకు రైతులకు ఆగ్రహం వస్తే దాదాపు 80నియోజకవర్గాల్లో వారు నాయకుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. సీఎం బొమ్మైకి ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడంలేదు.