కర్నాటకలో పిట్టపోరు పిల్లికి లాభమా..?
కర్నాటకలో అధికార బీజేపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తోంది. కానీ ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకత, కమీషన్ సర్కారు అనే ముద్ర, అవినీతి మరకలు.. ఈసారి ఆ ఛాన్స్ లేదని చెబుతున్నాయి.
పిట్టపోరు పిట్టపోరు పిల్లికి లాభం చేకూరుస్తుంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్, జేడీఎస్ కుమ్ములాట పరోక్షంగా బీజేపీకి లాభం చేకూరుస్తుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. కర్నాటకలో ప్రీ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కే మెజార్టీ వస్తుందంటున్నాయి. ఈ దశలో జేడీఎస్, కాంగ్రెస్ ని బలహీనపరచాలనుకుంటోంది. 15మంది కీలక నేతలు కాంగ్రెస్ ని వీడి జేడీఎస్ లో చేరతారని అంటున్నారు ఆ పార్టీ నేత కుమారస్వామి. అసెంబ్లీ ఎన్నికల ముందు 15మంది నేతలు కాంగ్రెస్ నుంచి తమవైపు వచ్చేస్తారని అంటున్నారు. కాంగ్రెస్ బలహీన పడటం ఖాయమంటున్నారు.
గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ కూటమి అధికారంలోకి వచ్చినా.. అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. దాంతో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య స్నేహం చెదిరిపోయింది. ఉమ్మడి శత్రువు బీజేపీని కలసి దెబ్బకొట్టాల్సిన సందర్భంలో కాంగ్రెస్, జేడీఎస్ కీచులాడుకోవడంతో కాషాయదళం పండగ చేసుకుంటోంది.
కర్నాటకలో అధికార బీజేపీ మరోసారి ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తోంది. కానీ ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకత, కమీషన్ సర్కారు అనే ముద్ర, అవినీతి మరకలు.. ఈసారి ఆ ఛాన్స్ లేదని చెబుతున్నాయి. ప్రీ పోల్స్ కూడా బీజేపీ అధికారానికి దూరమవడం ఖాయమంటున్నాయి. అక్కడ బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని అనుకుంటున్నారు. కాంగ్రెస్ కి తోడు ప్రతిపక్షంలో ఉన్న జేడీఎస్ కూడా అధికారంకోసం చూస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ ని బలహీన పరిచే ప్రయత్నాలు చేస్తోంది.
బీజేపీలోకి వలసలు..
కాంగ్రెస్ నేతలు తమవైపు వస్తారని జేడీఎస్ చెబుతుంటే, జేడీఎస్ నేతలు సైలెంట్ గా బీజేపీలో చేరుతున్నారు. ఎల్ఆర్ శివరామే ఇటీవలే బీజేపీలో చేరారు. తనతోపాటు మరో 10మంది జేడీఎస్ ని వదిలి బీజేపీలోకి వస్తారంటున్నారాయన. ఎన్నికల వేళ.. ఎలాంటి నాయకులు వచ్చినా కాషాయకండువా కప్పేస్తుంది బీజేపీ. ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చేందుకే ఇలాంటి చేరికల వ్యూహం పన్నింది. మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ ఒకరినొకరు బలహీనపరచుకునే ప్రయత్నాలు బీజేపీకి లాభం చేకూరిస్తే మాత్రం అది ఆ రెండు పార్టీల స్వయంకృతాపరాధమేనంటున్నారు విశ్లేషకులు.