యూత్ టార్గెట్ గా కాంగ్రెస్ కొత్త స్కీం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అదే ట్రంప్ కార్డవుతుందని నమ్మకం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విలూరుతున్న హస్తం పార్టీ యూత్ టార్గెట్ గా కొత్త స్కీం తీసుకురాబోతుంది. ఫిబ్రవరి 5న జరిగ ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే యువతకు రూ.8,500 ఇస్తామని ఆ పార్టీ ముఖ్య నాయకుడు సచిన్ పైలెట్ ప్రకటించారు. అయితే ఇదేదో పెన్షన్ మాదిరిగా ఫ్రీగా ఇచ్చే పథకం ఎంతమాత్రమూ కాదని తేల్చిచెప్పారు. నైపుణ్యాలు గల యువతకు మాత్రమే ఈ స్కీం వర్తిస్తుందన్నారు. ఏదైనా కంపెనీ, ఫ్యాక్టరీలో యువత తమకు ఉన్న స్కిల్ ను చూపించాలని.. సంబంధిత కంపెనీ ఒక్కో యువకుడికి రూ.8.500 చొప్పున సాయం అందిస్తుందని చెప్పారు. తద్వారా నిరుద్యోగ యువత తాము ఎంచుకున్న రంగాల్లో స్థిరపడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దోహదం చేస్తుందన్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధికి ఈ పథకం ఎంతగానో ఉపయోగ పడుతుందని, అలాగే నిరుద్యోగితను తగ్గిస్తుందని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో యూత్ టార్గెట్ గా ప్రకటించిన ఈ పథకం కాంగ్రెస్ పార్టీకి ట్రంప్ కార్డుగా ఉపయోగ పడుతుందని లెక్కలు వేసుకుంటున్నారు.