5 హామీలు, 50వేల కోట్లు.. కర్నాటకలో కాంగ్రెస్ కష్టాలు

కాంగ్రెస్ ఉచిత హామీలు అమలు చేయాలంటే ప్రతి ఏడాది 50వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిందే. ఈ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం ఆర్థికంగా చితికిపోతుందని ప్రతిపక్షాలు అంటున్నాయి.

Advertisement
Update:2023-06-02 17:24 IST

ఎన్నికల వేళ ఉచిత హామీలతో ప్రజల్ని ఆకట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చాక వాటి అమలు కత్తిమీద సాములా మారింది. 5 ప్రధాన హామీల అమలుకి ప్రతి ఏటా బడ్జెట్ లో 50వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సిన పరిస్థితి. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే హామీల అమలు మొదలవుతుందంటున్న సీఎం సిద్ధరామయ్య.. డెడ్ లైన్ మాత్రం ప్రకటించలేకపోతున్నారు. తాజాగా మంత్రి వర్గ సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో కలసి మీడియాతో మాట్లాడిన సీఎం సిద్ధరామయ్య.. ఐదు హామీల అమలుపై చర్చ జరిగిందన్నారు. అన్ని హామీలు అమలు చేస్తామని మరోసారి ప్రజలకు భరోసా ఇచ్చారు. ఐదింట మూడింటికి ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మహిళలకు ఆర్థిక సాయం, ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం, ఉచిత బియ్యం, నిరుద్యోగ భృతి హామీల అమలుకోసం కర్నాటక ప్రజలు ఇప్పటికే పట్టుబడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. కరెంటు చార్జీలు చెల్లించబోమంటూ కొంతమంది ఎదురు తిరుగుతున్నారని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలు టికెట్ తీసుకోడానికి నిరాకరిస్తున్నారని చెబుతున్నారు. వీటిలో వాస్తవం ఉన్నా లేకపోయినా.. సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం రోజే హామీలు అమలులో పెడతారని కర్నాటక ప్రజలు ఆశించారు. కానీ అది సాధ్యం కాకపోవడంతో నిరాశపడ్డారు.

తాజా మంత్రి వర్గ సమావేశంలో పథకాల అమలుపై కసరత్తు జరిగింది. ‘అన్న భాగ్య’ పథకం కింద బీపీఎల్, అంత్యోదయ కార్డుదారులకు జూలై 1 నుంచి 10 కేజీల బియ్యం అందిస్తామని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ‘గృహజ్యోతి’ పథకం కింద రాష్ట్రంలోని ఇంటింటికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ను అందజేస్తామన్నారు. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించే కుటుంబాలు కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. ఇక ‘గృహలక్ష్మి’ పథకం కింద 2000 రూపాయల ఆర్థిక సాయం కోసం జూన్-15నుంచి జులై-15లోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, నిరుద్యోగ భృతి విషయంలో మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు.

50వేల కోట్లు..

కాంగ్రెస్ ఉచిత హామీలు అమలు చేయాలంటే ప్రతి ఏడాది 50వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిందే. ఈ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం ఆర్థికంగా చితికిపోతుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ పథకాల అమలుకోసం కాంగ్రెస్ పై ఒత్తిడి పెరిగిపోతోంది. 

Tags:    
Advertisement

Similar News