కర్నాటక: బీజేపీకీ షాక్... ఆ పార్టీకి మాజీ ముఖ్యమంత్రి రాజీనామా!
తనకు టికెట్ ఇవ్వలేదనే విషయాన్ని చివరి వరకు దాచారని శెట్టర్ పార్టీ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డేను కలిసి తన రాజీనామా లేఖ సమర్పించారు. బీజేపీని వీడిన శెట్టర్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారని సమాచారం.
కర్నాటకలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీజేపీలో రజీనామాల రగడ ఆగడం లేదు. ఇప్పటికే అనేక మంది, ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామాలు చేయగా, ఈ రోజు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ కాషాయపార్టీకి గుడ్ బై చెప్పారు.
మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తనకు టికెట్ నిరాకరించడంతో అసంతృప్తితో ఉన్న ఆయన ఆదివారం నాడు కర్ణాటక అసెంబ్లీకి కూడా రాజీనామా చేశారు.
తనకు టికెట్ ఇవ్వలేదనే విషయాన్ని చివరి వరకు దాచారని శెట్టర్ పార్టీ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డేను కలిసి తన రాజీనామా లేఖ సమర్పించారు. బీజేపీని వీడిన శెట్టర్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారని సమాచారం.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శెట్టర్ మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హుబ్బళ్లి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ టిక్కెట్‌ను ఆశించారు, అయితే ఆ పార్టీ తిరస్కరించింది.
ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, ధర్మేంద్ర ప్రధాన్ శనివారం అర్థరాత్రి వరకు ఆయనను ఒప్పించేందుకు ప్రయత్నించారు, కానీ ఆయన వెనక్కి తగ్గలేదు.
బీజేపీ తనను తీవ్ర అవమానానికి,మానసిక హింసకు గురిచేసిందని ఆరోపించిన శెట్టర్ తనకు టిక్కెట్ నిరాకరించడం వల్ల రాష్ట్రంలో 20-25 సీట్లలో బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.