కాంగ్రెస్ లో కమల్ పార్టీ విలీనం..! అసలు సంగతి ఏంటంటే..?
మక్కల్ నీది మయ్యం అధికారిక వెబ్ సైట్లో ఇటీవల ఓ సందేశం కనిపించింది. ‘2024 ఎన్నికల నిమిత్తం జనవరి 30, 2023 నాటికి మక్కల్ నీది మయ్యం అధికారికంగా కాంగ్రెస్‌లో విలీనం అవుతుంది’ అనే మెసేజ్ చూడగానే అందరూ షాకయ్యారు.
కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యమ్(MNM) పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతోందా..? ఎవరో పుట్టించిన పుకారు కాదిది. సాక్షాత్తూ MNM అధికారిక వెబ్ సైట్ లో కనిపించిన స్టేట్ మెంట్ ఇది. దీంతో అందరూ ఆ వార్త నిజమేననుకున్నారు. అందులోనూ ఆమధ్య భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని, కమల్ హాసన్ ప్రత్యేకంగా వెళ్లి కలవడం, ఆయనతో కలసి నడవడం, ఇంటర్వ్యూ చేయడం.. ఇవన్నీ చూస్తుంటే ఈ వార్త నిజమేననిపిస్తోంది. కానీ విలీనం వాస్తవం కాదంటూ తాజాగా కమల్ హాసన్ ప్రకటించారు. అసలెందుకీ ప్రకటన చేశారు, ఎందుకు కాదంటున్నారు...? అసలేంటి కథ..?
వెబ్ సైట్ హ్యాక్..
మక్కల్ నీది మయ్యం అధికారిక వెబ్ సైట్లో ఇటీవల ఓ సందేశం కనిపించింది. ‘2024 ఎన్నికల నిమిత్తం జనవరి 30, 2023 నాటికి మక్కల్ నీది మయ్యం అధికారికంగా కాంగ్రెస్‌లో విలీనం అవుతుంది’ అనే మెసేజ్ చూడగానే అందరూ షాకయ్యారు. జోడో యాత్రలో విలీనం గురించి మాట్లాడుకుని ఉంటారని, ఇప్పుడది ఇంప్లిమెంట్ చేస్తున్నారని అనుకున్నారు. కానీ అసలు విషయం ఇది అంటూ కమల్ హాసన్ ప్రకటన విడుదల చేశారు. తమ పార్టీ వెబ్ సైట్ హ్యాక్ అయిందని తెలిపారు. విలీనం వార్త ఫేక్ అని తేల్చేశారు. ప్రస్తుతం వెబ్ సైట్ ని మూసివేస్తున్నామని, అప్డేట్ చేసిన తర్వాత తిరిగి దాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు కమల్ హాసన్.
‘ప్రజాస్వామ్య స్వరాన్ని అణచివేయాలని చూసే మూకలు ఈ హ్యాకింగ్ కు పాల్పడ్డాయి. దీనిపై మేం తగిన విధంగా స్పందిస్తాం’ అని MNM తరపున ట్వీట్ విడుదల చేశారు. వాస్తవానికి తమిళనాడులో కమల్ హాసన్ పార్టీ పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం కమల్ అయినా గెలుస్తారనుకుంటే అదీ లేదు. బీజేపీ మహిళా నేత చేతిలో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత ఆ పార్టీపై ఎవరికీ అంచనాలు లేకుండా పోయాయి. ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో MNM పోటీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చింది. దీంతో MNM రాజకీయ భవిష్యత్తుపై అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు పార్టీ పెట్టానన్న కమల్ హాసన్.. డీఎంకేతో పొత్తులో ఉన్న కాంగ్రెస్ కి మద్దతివ్వడం విశేషమే. ఈ నేపథ్యంలో అసలు MNM పార్టీనే కాంగ్రెస్ లో కలపబోతున్నారనే వార్త నిజమేననే చాలామంది నమ్మారు. కానీ వెబ్ సైట్ హ్యాక్ అయిందని చెప్పిన కమల్, విలీనం వార్తల్ని ఖండించారు.