సుప్రీం కోర్టు నూతన చీఫ్ జస్టిస్‌గా లలిత్ ప్రమాణం
నూతన సీజే లలిత్ మూడు నెలల కన్నా తక్కువ సమయమే ఆ పదవిలో ఉంటారు. ఆయనకు నవంబర్ 8వ తేదీతో 65 ఏళ్లు పూర్తికానుండటమే దీనికి కారణం.
సుప్రీం కోర్టు నూతన చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి జగదీష్ ధన్‌ఖడ్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తదితరులు హాజరయ్యారు. ఇప్పటివరకు చీఫ్ జస్టిస్‌గా ఉన్న ఎన్‌వీ రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. నూతన సీజే లలిత్ మూడు నెలల కన్నా తక్కువ సమయమే ఆ పదవిలో ఉంటారు. ఆయనకు నవంబర్ 8వ తేదీతో 65 ఏళ్లు పూర్తికానుండటమే దీనికి కారణం.
స్వస్థలం మహారాష్ట్ర...
జస్టిస్ లలిత్ మహారాష్ట్రకు చెందినవారు. 1957 నవంబర్ 9న జన్మించారు. 1983 జూన్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1985 డిసెంబరు వరకు బొంబాయి హైకోర్టులో ప్రాక్టీస్ చేసిన ఆయన 1986 జనవరి నుంచి తన ప్రాక్టీసును సుప్రీంకోర్టుకు మార్చారు. 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన తండ్రి యూఆర్ లలిత్ బొంబాయి హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో అడిషనల్ జడ్జిగా, సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా సేవలందించారు.
కీలక కేసుల్లో న్యాయమూర్తిగా...
దేశంలో సంచలనం సృష్టించిన ట్రిపుల్ తలాక్ కేసులో, కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ హక్కు కేసులో తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో ఆయన కూడా ఉన్నారు.