సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
కేంద్రానికి సిఫార్సు చేసిన ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అధికారికంగా కేంద్రానికి సిఫార్సు చేశారు. ఈ సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే సుప్రీంకోర్టు 51వ సీజేగా జస్టిస్ ఖన్నా నియమితులు కానున్నారు.
నిబంధనల ప్రకారం ఈ ప్రతిపాదనను ప్రస్తుత సీజేఐ లేఖ రూపంలో కేంద్ర న్యాయ శాఖకు పంపిస్తారు. ఆ లేఖను కేంద్ర న్యాయ శాఖ ప్రధాని పరిశీలన కోసం పంపిస్తుంది. ఆయన ఆమోదం అనంతరం రాష్ట్రపతికి చేరుతుంది. అంతిమంగా రాష్ట్రపతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడుతారు.
సంప్రదాయం ప్రకారం సీజేఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టడానికి సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేస్తారు. ఈ మేరకు జస్టిస్ చంద్రచూడ్ తర్వాత జస్టిస్ ఖన్నా అత్యంత సీనియర్‌గా ఉన్నారు. సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ పదవీ కాలం నవంబర్ 11న ముగియనున్నది. అనంతరం జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. 2025, మే13వరకు సీజేఐగా కొనసాగనున్నారు.