BBC డాక్యుమెంటరీపై నిషేధాన్ని ఖండించిన జర్నలిస్టు సంఘాలు
బ్రిటిష్ రాజ్ హయాంలో, యుద్ధ సమయంలో వచ్చే వార్తలను పరీక్షించడానికి ఉద్దేశించిన యుద్ధకాల సంస్థగా PIB ని మార్చేస్తున్నారు అని జర్నలిస్టు సంఘాలు ఆరోపించాయి.
2002 గుజరాత్ అల్లర్లపై BBC డాక్యుమెంటరీని నిషేధించడాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్2021కి సవరణలు చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. వివిధ విశ్వవిద్యాలయాల్లో బిబిసి డాక్యుమెంటరీని ప్రసారం చేయడానికి ప్రయత్నించినందుకు విద్యార్థులపై పెరుగుతున్న దాడుల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్స్ (NAJ), ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (DUJ) ఒక సంయుక్త ప్రకటనలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్2021కి ముసాయిదా సవరణలను, BBC డాక్యుమెంటరీని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అత్యవసర అధికారాలను ఉపయోగించడాన్ని ఖండించాయి.
DUJ అధ్యక్షుడు, S.K.పాండే, ప్రధాన కార్యదర్శి, సుజాత మధోక్; NAJ సెక్రటరీ జనరల్ N. కొండయ్య; ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (APWJF) ప్రధాన కార్యదర్శి G.ఆంజనేయులు విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో,ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ను ఎమర్జెన్సీ సమయంలో చేసినట్లు "పోలీస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో"గా మార్చుతున్నారని ఆరోపించారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్2021కి ముసాయిదా సవరణ ప్రకారం, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ నకిలీ గా తేల్చిన ఏదైనా వార్తలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో సహా అన్ని ప్లాట్‌ఫారమ్ల నుండి తీసివేయవలసి ఉంటుందని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) తెలిపింది.
“మీడియాకు ప్రభుత్వ వార్తలను అందించడమే PIB నెరవేర్చాల్సిన పాత్ర . మీడియాను పర్యవేక్షించడం, సెన్సార్ చేయడం, ప్రభుత్వానికి ఇష్టంలేని సమాచారాన్ని ‘ఫేక్ న్యూస్’గా గుర్తించడం దీని పని కాదు, ”అని జర్నలిస్టు సంఘాలు పేర్కొన్నాయి.
బ్రిటిష్ రాజ్ హయాంలో, యుద్ధ సమయంలో వచ్చే వార్తలను పరీక్షించడానికి ఉద్దేశించిన యుద్ధకాల సంస్థగా PIB ని మార్చేస్తున్నారు అని జర్నలిస్టు సంఘాలు ఆరోపించాయి.
“మీడియా వ్యక్తులకు అధికారిక సమాచారాన్నివ్వడం PIB పని. ప్రభుత్వ విషయాల్లో అవసరమైన సమాచారాన్ని కూడా గుర్తింపు పొందిన కరస్పాండెంట్లకు అందించడానికి PIB కొన్ని సందర్భాల్లో నిరాకరించడం దిగ్భ్రాంతికరం” అని ప్రకటన పేర్కొంది.
అంతేకాకుండా, ప్రభుత్వం సవరించిన ఐటి నిబంధనల వల్ల కేవలం పిఐబికి మాత్రమే కాకుండా అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు కూడా తాము అభ్యంతరం వ్యక్తం చేసిన వార్తలను సోషల్ మీడియా నుండి తీసివేయమని డిమాండ్ చేసే అధికారం ఇస్తుందని ప్రకటన పేర్కొంది. ఇది చిన్న, స్వతంత్ర డిజిటల్ మీడియాను సెన్సార్ చేయడానికి ఉద్దేశించిన చర్యగా కనిపిస్తోందని జర్నలిస్టు సంఘాలు మండి పడ్డాయి.