'సుప్రీం' బెయిల్ ఇచ్చినా, జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్ ఇంకా జైల్లోనే...
యూఏపీఏ కేసులో జర్నలిస్టు సిద్దిఖ్ కప్పన్ కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఆయనింకా జైల్లోనే ఉన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో బెయిల్ రానందున ఆయనింకా జైల్లోనే ఉండాల్సి వస్తోంది.
సుప్రీంకోర్టు బెయిల్ లభించినా కేరళ జర్నలిస్టు సిద్ధిఖ్ కప్పన్ ఇంకా జైలులోనే ఉండాల్సివస్తోంది. ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న కేసు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున ఆయన జైలులోనే కొనసాగుతారని జైలు శాఖ అధికారులు తెలిపారు. 2020 అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు వెళుతుండగా అరెస్టు చేసిన తర్వాత జైలులో ఉన్న కప్పన్‌ను విడుదల చేస్తూ సోమవారం ఇక్కడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హత్రాస్ లో ఓ దళిత యువతి అత్యాచారానికి గురై మరణించింది. ఈ సంఘటనపై వాస్తవాలు తెలుసుకునేందుకు జర్నలిస్టు కప్పన్ హత్రాస్ వెళుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. కప్పన్ తో పాటు అతికుర్ రెహ్మాన్, ఆలం, మసూద్ లకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలు ఉన్నాయని, హింసను ప్రేరేపించే కుట్రలో భాగమయ్యారని ఆరోపిస్తూ మథురలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న కేసు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున కప్పన్ జైలులోనే ఉంటాడని డిజి జైలు పీఆర్వో సంతోష్ వర్మ తెలిపారు.
అతనిని విడుదల చేయాలనికి ఆదేశిస్తూ, అదనపు సెషన్స్ జడ్జి (ఎఎస్ జె) అనురోద్ మిశ్రా రూ. 1 లక్ష చొప్పున రెండు పూచీకత్తులు, అదే మొత్తానికి వ్యక్తిగత బాండ్‌ను ఇవ్వాలని కప్పన్ ను ఆదేశించారు. అలాగే బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించబోనని కప్పన్ హమీ ఇవ్వాలని కూడా ఎఎస్ జె ఆదేశించారు.
కాగా, సుప్రీంకోర్టు శుక్రవారం కప్పన్‌కు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అపిడవిట్ ను కూడా పరిగణనలోకి తీసుకుని అతనికి బెయిల్ మంజూరు చేస్తూ అనేక షరతులను విధించింది, జైలు నుండి విడుదలైన తర్వాత వచ్చే ఆరు వారాల పాటు అతను ఢిల్లీలోనే ఉంటూ ప్రతి సోమవారం నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
కప్పన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు, జర్నలిస్టు సంఘాలు స్వాగతించాయి. కప్పన్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సాఫ్ట్ టార్గెట్ చేసిందని ఆరోపించాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అతనిపై దాఖలైన మరో కేసులో కూడా అతనికి బెయిల్ లభిస్తుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.