ఇది సెల్ఫీ పండగ.. మోదీపై సోషల్ మీడియాలో జోకులు..

జెండాతో సెల్ఫీ దిగి వాట్సప్ డీపీలుగా పెట్టండి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి అంటూ మోదీ ఇచ్చిన పిలుపు ఇప్పటికే సంచలనంగా మారింది. స్వాతంత్ర దినోత్సవ పండగను, సెల్ఫీ పండగలా మార్చేశారంటూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు.

Advertisement
Update:2022-08-12 10:06 IST

భారత దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఎన్నో మైలురాళ్లు దాటి ఇప్పుడు 75వ వసంతంలోకి అడుగు పెడుతున్నాం. ఈ 75 ఏళ్లలో ఎంతోమంది ప్రధానులు మారారు, ఒక్కొక్కరిదీ ఒక్కో పంథా. ఒక్కొక్కరిదీ ఒక్కో ఆశయం. కానీ వజ్రోత్సవాల వేళ ప్రధానిగా ఉన్న నరేంద్రమోదీ మాత్రం సోషల్ మీడియాలో అందరికీ టార్గెట్ అయ్యారు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటంటే..?

స్వాతంత్ర దినోత్సవ 25వ వార్షికోత్సవాన్ని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో జరుపుకున్నారు. పాతికేళ్ల స్వాతంత్ర సంబరాల్లో పాల్గొన్న ఇందిరాగాంధీ పేదరిక నిర్మూలనపై ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత ముఖ్య ఘట్టం 50 ఏళ్లు. స్వాతంత్ర స్వర్ణోత్సవాలుగా సంబరాలు చేసుకున్నారు. అప్పటి ప్రధాని ఐకే గుజ్రాల్ నిరక్షరాస్యతను నిర్మూలిద్దామంటూ పిలుపునిచ్చారు. ఇప్పుడు 75వ ఏడాదిలో ఉన్నాం. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ కూడా ఇప్పుడు దేశ ప్రజలందరికీ ఓ కీలకమైన సందేశాన్నిచ్చారు. సోషల్ మీడియాలో ఫొటో పెట్టాలంటూ సూచించారు. ఈ సూచనే దేశవ్యాప్తంగా మోదీ ప్రచార కాంక్షను బయటపెట్టింది. సెల్ఫీ ప్రధాని, సోషల్ మీడియా ప్రధాని అంటూ నెటిజన్లు హోరెత్తిస్తున్నారు.

మోదీకి ప్రచార యావ కాస్త ఎక్కువే. అంతర్జాతీయ సమావేశాల్లో అయినా, ఆఖరికి మొన్నటి రాష్ట్రపతి వీడ్కోలు సమావేశంలో అయినా ఆయన కళ్లన్నీ కెమెరాలవైపే ఉంటాయి. కెమెరాలకు ఎవరైనా అడ్డొస్తే చీదరించుకోవడం, పక్కకు నెట్టేయడం ఆయనకు అలవాటే. అలాంటి వీడియోలు కోకొల్లలు. తాజాగా స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా కూడా మోదీ, ఫొటోలను వదిలిపెట్టలేదు, సోషల్ మీడియాను దూరం పెట్టలేదు. తనతోపాటు మిగతావారందరికీ కూడా ఉద్భోద చేయడం ఇక్కడ కొసమెరుపు. జెండాతో సెల్ఫీ దిగి వాట్సప్ డీపీలుగా పెట్టండి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి అంటూ మోదీ ఇచ్చిన పిలుపు ఇప్పటికే సంచలనంగా మారింది. స్వాతంత్ర దినోత్సవ పండగను, సెల్ఫీ పండగలా మార్చేశారంటూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు.

పాతికేళ్ల స్వాతంత్ర ఉత్సవంలో అప్పటి ప్రధాని పేదరిక నిర్మూలనకు పిలుపునిస్తే, ఆ తర్వాత యాభయ్యేళ్ల స్వర్ణోత్సవంలో ప్రధాని నిరక్షరాస్యత నిర్మూలనకు సందేశమిస్తే, ఇప్పటి వజ్రోత్సవాల వేళ ప్రధాని ఫొటో దిగి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయాలనే సందేశం అందరికీ వింతగా తోస్తోంది.

Tags:    
Advertisement

Similar News