జార్ఖండ్ రాజకీయ సంక్షోభం: 'రిసార్ట్ రాజకీయాలు' షురూ !

జార్ఖండ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒకవైపు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తమ కూటమి ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి వాళ్ళందరినీ చత్తీస్ గడ్ కు తరలిస్తున్నారు.

Advertisement
Update:2022-08-27 16:26 IST

జార్ఖండ్ లో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. కాంగ్రెస్-జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)కి చెందిన ఎమ్మెల్యేలను పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌కు త‌రలిస్తున్నారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరన్ సహా ఎమ్మెల్యేలు ఓ బస్సులో వెళ్తున్న ఇమేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఎమ్మెల్యేల‌ను సుర్గుజా జిల్లాలోని మైన్‌పట్ హిల్ స్టేషన్‌లో ఉంచే అవకాశాలు క‌న‌బ‌డుతున్నాయ‌ని మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి .

మైనింగ్ కాంట్రాక్ట్ ల కారణంగా ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ పై ఎమ్మెల్యేగా అనర్హ‌త వేటు ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న ఊహాగానాల మధ్య తన అధికారిక నివాసంలో నిన్న రెండుసార్లు ఎమ్మెల్యేలతో స‌మావేశమై చ‌ర్చంచారు సోరెన్. ఈ ఉదయం జెఎంఎం నేతృత్వంలోని పాలక యుపిఎ కూటమి శాసనసభ్యులతో మ‌రోసారి సమావేశమై తాజా రాజ‌కీయ ప‌రిణామాలు, బిజెపి కుటిల ప్ర‌య‌త్నాల‌పై చ‌ర్చించారు. త‌మ కూట‌మి ఎమ్మెల్యేలంద‌రినీ బిజెపి బేర‌సారాల‌కు దూరంగా ఐక్యంగా ఉంచాల‌ని నిర్ణ‌యించుకున్నట్టు తెలిసింది. వీరిని సుర‌క్షిత ప్రాంతంలో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నార‌ని వార్త‌లు వెలువ‌డుతున్నాయి.

గ‌త కొంత కాలంగా జార్ఖండ్ రాష్ట్రంలో తిష్ట‌వేయాల‌ని బిజెపి ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు ఎర వేసింది. ఈ క్ర‌మంలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు భారీ న‌గ‌దుతో బెంగాల్ పోలీసుల‌కు చిక్కారు. వీరిని పార్టీ స‌స్పెండ్ చేసింది. అయినా బిజెపి రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు అయ్యేవ‌ర‌కూ వేచి ఉండి ఆ త‌ర్వాత నుంచీ మ‌ళ్ళీ త‌న కుయుక్తులు ప్రారంభించింది. ముఖ్య‌మంత్రి సోరేన్ పై మైనింగ్ కాంట్రాక్టుల‌ను సొంతంగా కేటాయించుకున్నారంటూ గ‌వ‌ర్న‌ర్ కు త‌న రాష్ట్ర పార్టీ శాఖ‌తో ఫిర్యాదు చేయించింది. ఆయ‌న దానిని ఎన్నిక‌ల సంఘం(ఈసీ)ప‌రిశీల‌న‌కు పంపండం, సీఎం పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని ఈసీ సిఫార్సు చేసిన విష‌యం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఏ క్ష‌ణ‌మైనా గ‌వ‌ర్న‌ర్ చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉందంటున్నారు. దీనికి ముందుగా బిజెపి త‌న‌కు గ‌ల 'అవ‌కాశాల‌ను' వెదుక్కొంటూ ప్ర‌భుత్వ ఏర్పాటుకు సిద్ధ‌మ‌య్యే వ‌ర‌కూ గ‌వ‌ర్న‌ర్ నుంచి ఉత్త‌ర్వులు వెలువ‌డ‌క‌పోవ‌చ్చ‌నే వాద‌న వినిపిస్తోంది. ముఖ్యమంత్రి సోరేన్ నైతిక‌త‌ను కోల్పోయార‌ని ఆయ‌న త‌క్ష‌ణం త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి తాజాగా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని బిజెపి ఇప్ప‌టికే డిమాండ్ చేస్తోంది.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తన ప్రభుత్వాన్ని కూల్చివేయడమే "సైతాను శక్తులు" లక్ష్యంగా పెట్టుకున్నాయని సోరెన్ విమ‌ర్శించారు. తనకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయ‌ని, వారు తనపై ఉంచిన నమ్మకం వ‌మ్ము చేయ‌న‌ని అన్నారు. ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడేందుకు, బిజెపి కుటిల నీతిని ఎండ‌గ‌ట్టేందుకు త‌న చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతానని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News