వితంతువులు మళ్లీ పెళ్లాడితే రూ. 2 లక్షలు.. జార్ఖండ్ ప్రభుత్వం కీల‌క ప్రకటన

భర్త మరణించిన తర్వాత మళ్లీ వివాహం చేసుకున్న మహిళలకు ప్రభుత్వం రూ. 2 లక్షల ప్రోత్సాహకం అందిస్తుంది. అయితే, లబ్ధిదారులు వివాహ వయసు కలిగి ఉండాలి.

Advertisement
Update:2024-03-08 14:18 IST

దేశంలోనే మొట్టమొదటిసారిగా జార్ఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘విధ్వా పునర్వివాహ ప్రోత్సాహన్ యోజన’ పేరుతో వితంత పునర్వివాహ ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించింది. ఈ ప‌థ‌కం ద్వారా భర్త మరణించిన తర్వాత మళ్లీ వివాహం చేసుకునే మహిళలు రూ. 2 లక్షల ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని అందుకుంటారు. అయితే, లబ్ధిదారులు వివాహ వయసు కలిగి ఉండాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్, ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఈ ప‌థ‌కం వర్తించదు.

పథకం గురించి స్త్రీ, శిశు, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి మనోజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. జీవిత భాగస్వామి మరణించిన తర్వాత మహిళలు సమాజంలో ఒంటరిగా, నిస్సహాయులుగా మిగిలిపోతున్నారని, ఈ పథ‌కం వల్ల వారు మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చని అన్నారు. వితంతువుల్లో ఈ పథకం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని, మహిళల పునర్వివాహం పట్ల సామాజిక అభిప్రాయాన్ని మారుస్తుందని పేర్కొన్నారు.

ఈ పథకం కింద భర్త మరణించిన తర్వాత మళ్లీ వివాహం చేసుకున్న మహిళలకు ప్రభుత్వం రూ. 2 లక్షల ప్రోత్సాహకం అందిస్తుంది. అయితే, లబ్ధిదారులు వివాహ వయసు కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్, ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఇది వర్తించదు. ఈ పథకం ప్రయోజనాలు పొందేందుకు లబ్దిదారు పునర్వివాహ తేదీ నుంచి ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాలి. దీంతోపాటు దివంగత భర్త మరణ ధ్రువీకరణ పత్రం జతచేయాల్సి ఉంటుంది.

రాంచీలోని తానా భగత్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఏడుగురు పథక లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ మొత్తం రూ.14 లక్షలను ప్రదానం చేశారు. అలాగే అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇకపై నెలకు రూ.9,500 గౌరవ వేతనం, సహాయకులకు రూ.4,750, వృద్ధాప్య పింఛను మొదటి విడతగా 1,58,218 మంది బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయనున్నట్లు సీఎం తెలిపారు.

Tags:    
Advertisement

Similar News