సుదీప్ సినిమాలపై నిషేధం విధించండి.. ఈసీకి జేడీఎస్ లేఖ

జేడీఎస్ పార్టీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాసింది. సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆయన నటించిన సినిమాలు ప్రసారం అయితే ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయ పడింది.

Advertisement
Update:2023-04-07 19:38 IST

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయ వేడి రాజుకుంటోంది. మళ్లీ అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ.. ఈసారి ఎలాగైనా ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌ని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా, ఇటీవల కన్నడ అగ్ర హీరో సుదీప్ బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన నటించిన సినిమాలు, షోలు, వాణిజ్య ప్రకటనల ప్రసారంపై నిషేధం విధించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు అందుతున్నాయి.

హీరో సుదీప్ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తో బుధవారం సమావేశం అయ్యారు. బొమ్మైకి తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. తాను బీజేపీలో చేరడం లేదని, ఎన్నికల్లో పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే బొమ్మై సూచన మేరకు బీజేపీ అభ్యర్థుల తరఫున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తానని ప్రకటించారు. అయితే సుదీప్ బొమ్మైని కలసిన రోజే శివ మొగ్గకు చెందిన న్యాయవాది కేపీ శ్రీపాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశారు. సుదీప్ నటించిన సినిమాలు, షోలు, వాణిజ్య ప్రకటనలను ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు నిషేధం విధించాలని కోరారు.

తాజాగా.. జేడీఎస్ పార్టీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాసింది. సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆయన నటించిన సినిమాలు ప్రసారం అయితే ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయ పడింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు సుదీప్ నటించిన సినిమాలు, షోలు, వాణిజ్య ప్రకటనలపై నిషేధం విధించాలని జేడీఎస్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.

నాయక సామాజిక వర్గానికి (ఎస్టీ) చెందిన సుదీప్‌కు కర్ణాటకలో మాస్ ఫాలోయింగ్ బాగా ఉంది. దీంతో అతడిని తమ వైపునకు లాక్కోవడానికి రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలు ప్రయత్నించాయి. అయితే సుదీప్ మాత్రం ముఖ్యమంత్రి బొమ్మైకి తన మద్దతు ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News