కర్నాటకలో కాంగ్రెస్ సర్కారు కొనసాగడం కష్టమే.. - కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు
కర్ణాటకలో ఐదేళ్ల తర్వాతే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని తాను చెప్పలేనన్నారు. ఏం జరుగుతుందో తనకు తెలియదన్న కుమార.. ఇక్కడి పరిస్థితులను చూస్తుంటే రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని తనకు అనిపిస్తోందన్నారు.
రాబోయే రోజుల్లో కర్నాటక రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాలపైనే అక్కడి సర్కార్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. కర్నాటకలోని కాంగ్రెస్ సర్కారు దీర్ఘకాలం కొనసాగడం కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికలు ఐదేళ్ల తర్వాతే జరుగుతాయని చెప్పలేం..
గురువారం బెంగళూరులో జేడీఎస్ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కుమారస్వామి మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కేవలం 19 స్థానాలకే పరిమితం కావడంపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో ఐదేళ్ల తర్వాతే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని తాను చెప్పలేనన్నారు. ఏం జరుగుతుందో తనకు తెలియదన్న కుమార.. ఇక్కడి పరిస్థితులను చూస్తుంటే రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని తనకు అనిపిస్తోందన్నారు.
జోస్యం చెప్పట్లేదు..
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై తాను చేసిన విశ్లేషణ ఆధారంగానే ఈ మాటలు చెబుతున్నానని కుమారస్వామి చెప్పారు. అంతేగానీ, ఎవరితోనో చేతులు కలిపి అంటున్నట్టుగా ఎవరూ తప్పుగా భావించవద్దని ఆయన కోరారు. తాను ఏ విషయాలూ దాచి మాట్లాడట్లేదని.. అలాగని జోస్యం కూడా చెప్పడం లేదని స్పష్టం చేశారు.
ఆ హామీల వల్లే కాంగ్రెస్ గెలిచింది..
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 హామీల వల్లే కాంగ్రెస్ కు జనం ఓట్లు వేసి గెలిపించారని కుమారస్వామి తెలిపారు. ఆ హామీల వల్లే తమ పార్టీ ఉనికికి నష్టం జరిగిందని వివరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలని, ఏవైనా షరతుల పేరుతో ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేయొద్దని సూచించారు.