బీజేపీని ఓడించవచ్చు..!!

ఇదిలా ఉండగా 'ఆపరేషన్ సౌత్' ను కేసీఆర్ అమలు చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. దక్షిణాదిలోని 130 లోక్ సభ నియోజకవర్గాలలో బీజేపీ వ్యతిరేక శక్తులను 'మిత్రులు'గా మలచుకోవడం వలన బీజేపీ ప్రభావాన్ని 6 రాష్ట్రాల్లో 'జీరో'కు తీసుకు రావడమే ఆపరేషన్ సౌత్ ఉదేశ్యం.

Advertisement
Update:2022-12-10 15:23 IST

మరో ఏడాదిన్నరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలలో ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సవాలు విసరడం పట్ల జాతీయ పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నవి. బీజేపీ బయటకు కనిపిస్తున్నట్లు నిజానికి అతి శక్తిమంతమైన రాజకీయ పార్టీ ఏమీ కాదు. ఎల్లప్పుడూ మరో రాజకీయ పార్టీకి లేదా పార్టీల కూటమికి అధికార పార్టీని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది చరిత్ర రుజువు చేసిన సత్యం. అయితే కేసీఆర్ వలె పట్టుదల, నిబద్ధత, ప్రత్యర్థిని ఓడించాలన్న బలమైన సంకల్పం, పకడ్బందీ వ్యూహరచన, ధనబలం ఉంటే బీజేపీని ఢీకొనడం కష్టం కాదు. ఆ కిటుకు కేసీఆర్ కు బాగా తెలుసు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ కొట్టడానికి గాను మోడీ కుట్రలో భాగమని రేవంత్ రెడ్డి తదితరులు నిందిస్తున్నారు. తాము సంస్థాగతంగా ఎలా బలపడాలో, మోడీతో తలపడటానికి సంబంధించి ఎలాంటి రణతంత్రపుటెత్తులు వేయాలో తెలియని గందరగోళంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ పై నిందలు వేయడం హాస్యాస్పదంగా కనిపిస్తోంది.

1980 నుంచీ కాంగ్రెస్ పార్టీ దేశంలో తన పట్టు కోల్పోతూ వస్తోంది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి 20 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 52 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని, వరుసగా రెండో అపజయాన్ని మూటగట్టుకున్నది. కానీ, ఆ పార్టీకి చెందిన 100 మంది ఎంపీలు ఇంకా పార్లమెంటులో ఉన్నారు. 880 మంది ఎంఎల్ఏలూ ఉన్నారు. బీజేపీని ఎదుర్కోగల అతి పెద్ద పార్టీగా మిగిలింది కాంగ్రెస్‌ పార్టీ అనే విషయంలో ఎవరికీ సందేహం లేదు. 2024 ఎన్నికల్లో మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీని ఓడించడం అసాధ్యమేమీ కాదన్న విశ్లేషణలు ఉన్నవి. సరైన వ్యూహం, శ్రమతో బీజేపీని ఓడించడం అసాధ్యం కాదు. దేశంలో గెలిచే రాజకీయ పార్టీలన్నీ కేవలం 40 నుంచి 45 శాతం మించి ఓట్లను గెలుచుకోలేవు. 2019లో బీజేపీకి పోలైన ఓట్ల శాతం 38 మాత్రమే. వాటితోనే ఆ పార్టీ 300లకు పైగా ఎంపీ స్థానాలను కైవసం చేసుకుందన్న సంగతిని మనం మరెచ్చిపోరాదు.

ఏడు ఈశాన్య రాష్ట్రాలు సహా దక్షిణాదిలోని 200 ఎంపీ స్థానాల్లో అయిదో వంతును కూడా బీజేపీ దక్కించుకోలేక పోయింది. ఆయా రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు బీజేపీని సమర్ధవంతంగా అడ్డుకుంటున్నవి. ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని 340 ఎంపీ స్థానాల్లో బీజేపీ బలంగా ఉంది. అందులో 150 సీట్లను బీజేపీ వ్యతిరేక శక్తులు సాధించగలిగితే బీజేపీకి మెజారిటీని కుదించవచ్చు.

దేశవ్యాప్తంగా సోషల్ మీడియాను బీజేపీ స్థాయిలో కాంగ్రెస్ సమర్థంగా వినియోగించుకోలేకపోతున్నది. కాగా, ప్రచార కార్యక్రమాల్లో కనిపించే భారీ జనసందోహం, ఎన్నికల ఫలితాల మీద ఎలాంటి ప్రభావం చూపకపోవడాన్ని ఎన్నికల వ్యూహకర్తలు కనుగొన్నారు. పార్టీల ప్రచార సభలకు, కార్యక్రమాలకు హాజరయ్యే జనం వేరు, ఓట్లు వేసే వారు వేరు. అలాగే ధనప్రభావం కారణంగా రాజకీయాలలో ప్రవేశించడం చాలా ఖరీదైన వ్యవహారంగానూ మారిపోయింది. కోటీశ్వరులైతే తప్ప ఎన్నికల రాజకీయాల్లోకి రావడం వృథా అని నిర్ధారణ జరిగిపోయింది. దక్షిణాదిలో ఇది మరీ ఎక్కువ. తెలంగాణ, ఆంధ్రప్రదదేశ్ ఎన్నికల్లో వందల కోట్ల డబ్బు ప్రవహిస్తోంది. ఇదిలా ఉండగా సంక్షేమ పథకాలు, మహిళల సాధికారత సహా ఇతర అనేక విషయాల్లో ఏవి ఖచ్చితంగా ఎన్నికలను ప్రభావితం చేస్తాయో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నవి.

ఓటర్లు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో ప్రశాంత్ కిషోర్ వంటి కాకలు తీరిన వ్యూహకర్తలు కూడా పసిగట్టలేకపోతున్నారు. వారి ఆకాంక్షలు నిరంతరం మారిపోతున్నవి. అదీ గాక పోటీ చేస్తున్న అభ్యర్థులు తమకు ఓటుకు 3 వేలో, 5 వేలో లేదా ఇతర ఖరీదైన బహుమతులో ఇవ్వవలసిందేనని ఓటర్లు వివిధ పార్టీల అభ్యర్థులను డిమాండ్ చేయడం, నిలదీయడం దక్షిణాదిలో ప్రముఖంగా కనిపిస్తున్న దృశ్యం.

లోక్ సభ ఎన్నికలకు దాదాపు 17 నెలల సమయం ఉండటంతో కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీలూ బీజేపీని ఢీకొట్టేందుకు సన్నద్దమవుతున్నవి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సహా శివసేన పార్టీ నాయకులు కూడా బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. కేసీఆర్ ఒక అడుగు ముందుకు వేసి భారత్ రాష్ట్ర సమితి పేరిట జాతీయ పార్టీని స్థాపించడం సంచలన సంఘటన. బీజేపీ ప్రత్యక్షంగా, లేదా పొత్తులతో కలిపి చాలా రాష్ట్రాలలో రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో బీజేపీని ప్రతిపక్షాలేవీ నిలువరించలేకపోయినవి. గుజరాత్ లో 27 సంవత్సరాల తర్వాత కూడా మరోసారి అధికారాన్ని నిలుపుకుంది. 2014లో బీజేపీ కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గోవా, కర్నాటకతో పాటు కశ్మీర్ వంటి రాష్ట్రంలోనూ పీడీపీ మద్దతుతో కాషాయ జెండా ఎగురవేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో సైతం పార్టీ అధికారంలోకి వచ్చింది.

'రైతు చట్టాల'పై రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదని, కరోనా కాలంలో మోడీ ప్రభుత్వ పనితీరు బాగాలేదని, ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరం చేస్తున్నారని, యూపీలో ఉన్నావ్ రేప్ కేసు, హత్రాస్ ఘటన ఇలా ఎన్నో కారణాలు చూపుతూ.. బీజేపీ ఓటమి తథ్యమని అంతా భావించినా నాలుగు రాష్టాల్లో బీజేపీ గెలిచింది. దేశంలోని మెజారిటీ ప్రజలు ఇప్పటికీ బీజేపీ పాలననే కోరుకుంటున్నారని గుజరాత్ ఫలితాల దరిమిలా బీజేపీ ఒక సందేశాన్ని ప్రజలకు పంపిస్తోంది. వివిధ రాష్ట్రాలలో స్థానిక పరిస్థితులు ఎట్లా ఉన్నా, దేశ ప్రజలు బీజేపీనే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని బీజేపీ నాయకుల వాదన. 'మోడీ మానియా', సుస్థిర పాలన వంటివి బాగా ప్రభావితం చేస్తున్నవి.

బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు గడుస్తున్నా మోడీపై ప్రజాదరణ తగ్గకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది .ఇందుకు ప్రధాన కారణం ప్రధాన స్రవంతి మీడియా సహా సోషల్ మీడియా కూడా మోడీ జపం చేయడమే! సూటిగా చెప్పాలంటే మీడియా సంస్థలను బీజేపీ తన గుప్పిట్లోకి తీసుకోగలిగింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు భిన్నమైన తీర్పు ఇచ్చినా కేవలం గుజరాత్ ఫలితాన్నే మీడియా ఊదరగొట్టడం తాజా ఉదాహరణ. హిమాచల్ లో కాంగ్రెస్ విజయాన్ని పెద్దగా ప్రచారం చేయలేదు. కేంద్రంలో వరుసగా రెండు సార్లు పార్టీని అధికారంలోకి తీసుకురావడం, మెజారిటీ రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి రావడం ఒక్క మోడీతోనే సాధ్యమైంది. పార్లమెంట్ ఎన్నికలతోపాటు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోడీని చూసే ప్రజలు ఓట్లు వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ తో సహా ఇతర మూడు రాష్ట్రాల్లో అంతర్గతంగా పార్టీ నాయకుల మధ్య విభేదాలు, ప్రజల్లో వారిపై వ్యతిరేకత 'మోడీ మానియా' ముందు ప్రజలకు కనిపించడం లేదు. రాజకీయ వారసత్వం లేని మోడీ, బీజేపీలో వారసత్వ రాజకీయాలకు తావులేకుండా చేస్తున్నారని ఆ పార్టీ బలంగా ప్రచారం చేస్తోంది.

దేశంలో మోదీ వ్యతిరేక రాజకీయాలకు ఉన్న స్పేస్ ను వాడుకొని బలోపేతం కావలసిన శక్తులు బలహీనంగా ఉన్నవి. కనుక ఆ స్పేస్ ను భర్తీ చేయాలని కేసీఆర్ ఆలోచన. ఈ ఆలోచన వెనుక ఆయనకున్న అపారమైన అనుభవం, ఇరిగేషన్, విద్యుత్ తదితర రంగాలపై సాధికారత, పాలనా దక్షత ఉన్నవి. ప్రధానంగా కాంగ్రెస్ కుప్పకూలిపోతుండటం వల్ల బీజేపీ విజయాలకు జాతీయ స్థాయిలో బ్రేకులు వేసే వారు లేకుండా పోయారు. 2004లో లాగా కాంగ్రెస్ కనీసం 100 సీట్లు దాటినా ఒక 'ప్రత్యామ్నాయం' ఏర్పడడానికి వీలున్నప్పటికీ అలాంటి నమ్మకాన్ని కాంగ్రెస్ కలిగించడం లేదు. తన వ్యతిరేక శక్తులను బలహీనపరచేందుకు ఐటీ, సిబిఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ, అమిత్ షా ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారో దేశమంతా చూస్తోంది.

'మిషన్-7' పేరిట ఒక కార్యక్రమాన్ని చేపట్టినట్టు కొన్ని నెలల కిందట కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 165 ఎంపీ స్థానాలను లక్ష్యంగా చేసుకొని ఈ 'ఆపరేషన్' చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా 'ఆపరేషన్ సౌత్' ను కేసీఆర్ అమలు చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. దక్షిణాదిలోని 130 లోక్ సభ నియోజకవర్గాలలో బీజేపీ వ్యతిరేక శక్తులను 'మిత్రులు'గా మలచుకోవడం వలన బీజేపీ ప్రభావాన్ని 6 రాష్ట్రాల్లో 'జీరో'కు తీసుకు రావడమే ఆపరేషన్ సౌత్ ఉదేశ్యం. నిజానికి దక్షిణ భారతదేశంలో బీజేపీకి పట్టులేదు. ఆంధ్రప్రదేశ్ లోని 25 స్థానాలను బీజేపీయేతర పార్టీలే కైవసం చేసుకున్నవి. పాండిచ్చేరిలోని 1 స్థానమూ బీజేపీయేతరులదే. తమిళనాడులోని 39లో బిజెపి ఖాతా తెరవలేదు. తెలంగాణలోని 17 లో 4 స్థానాల్లో బీజేపీ గెలిచింది. కేరళలోని 20 లోక్ సభ నియోజకవర్గాల్లోనూ బిజెపికి ఖాతా లేదు. ఒక్క కర్ణాటకలో మాత్రం 28 స్థానాలకు గాను 25 చోట్ల బీజేపీ జెండా ఎగురవేసింది. మొత్తం 130 స్థానాలలో బీజేపీకి 29 స్థానాలున్నవి. ఆ 29 కూడా రాకుండా చేయడం ఎలా అన్నది ఒక సవాలే. కర్ణాటకలో జనతాదళ్ (సెక్యులర్) కుమారస్వామి, కేసీఆర్ జట్టు బీజేపీ ఆధిక్యాన్ని గండికొట్టే అవకాశాలున్నవి.

Tags:    
Advertisement

Similar News