అసోం రాష్ట్రానికి రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు
దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని ఆ రాష్ట్ర సీఎం వెల్లడి
రెండు రోజుల పాటు అసోం రాజధాని గుహవాటిలో జరిగిన వాణిజ్య పెట్టుబడుల సదస్సులో సుమారు రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. రిలయన్స్, అదానీ, వేదాంత, టాటా గ్రూప్ వంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపెట్టినట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు చేశారు.రూ.6-7 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలు రాగా.. పరిశీలన అనంతరం కొన్నింటికి అంగీకారం తెలుపలేదన్నారు. రానున్న మూడేళ్లలో ప్రారంభించే సామర్థ్యం ఉన్న సంస్థలతోనే అవగాహన కుదుర్చుకున్నామని వెల్లడించారు. తమ ప్రభుత్వం పరిమాణం కంటే నాణ్యతపైనే దృష్టిపెడుతుందని బిశ్వశర్మ తెలిపారు. హైడ్రో కార్బన్, మైన్స్, పునరుత్పాదక ఇంధన రంగాలు అత్యధిక పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని పేర్కొన్నారు.