అంతరిక్షంలోకి ఎల్‌వీఎం-3 రాకెట్.. కక్ష్యలోకి 36 ఉపగ్రహాలు

శనివారం ఉదయం 8.30 గంటలకు ఇస్రో అధికారులు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. 24.30 గంటల పాటు కొనసాగిన తర్వాత ఇవ్వాళ ఉదయం 9 గంటలకు రాకెట్ నిప్పులు చెరుగుకుంటూ నింగిలోకి వెళ్లింది.

Advertisement
Update:2023-03-26 10:20 IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేయింది. ఒకే సారి 36 ఉపగ్రహాలను రెండో సారి అంతరిక్షంలోకి పంపింది. ఇస్రో వాణిజ్య విభాగం చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో హర్షాతిరేకాలు వెలువడుతున్నాయి. ఏపీలోని తిరుపతి జిల్లాలోని షార్ రాకెట్ లాంఛింగ్ సెంటర్ నుంచి ఇవాళ ఉదయం 9.00 గంటలకు జీఎస్ఎల్వీ మార్క్3-ఎం3 (ఎల్వీఎం-3) రాకెట్ ద్వారా 36 శాటిలైట్లను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

శనివారం ఉదయం 8.30 గంటలకు ఇస్రో అధికారులు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. 24.30 గంటల పాటు కొనసాగిన తర్వాత ఇవ్వాళ ఉదయం 9 గంటలకు రాకెట్ నిప్పులు చెరుగుకుంటూ నింగిలోకి వెళ్లింది. ఇస్రో వాణిజ్య విభాగం అయిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ రెండు దశల్లో 72 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపడానికి యూకేకి చెందిన వన్‌వెబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. ఒప్పందంలో భాగంగా మొదటి 36 ఉపగ్రహాలను గతేడాది అక్టోబర్ 23న ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇక రెండో దశకు చెందిన మిగిలిన 36 ఉపగ్రహాలను ఇవ్వాళ ప్రవేశపెట్టింది.

ఇవ్వాళ నింగిలోకి పంపిన శాటిలైట్ల మొత్తం బరువు 5,805 కేజీలు. వీటిని 450 కిలోమీటర్ల దూరంలోని సర్క్యులర్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టారు. ఇది ఎల్వీఎం-3 రాకెట్‌కు సంబంధించి ఆరవ ప్రయోగం. గతంలో ఈ రాకెట్‌తో చేపట్టిన మొత్తం 5 ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. ఇందులో చంద్రయాన్ -2 మిషన్ కూడా ఉన్నది. కాగా ఇవ్వాళ్టి మిషన్‌లో విడతకు నాలుగు శాటిలైట్ల చొప్పున మొత్తం 9 దశల్లో ఉపగ్రహాలు కక్ష్యలోకి వెళ్లాయి. కాగా, ఇస్రో వాణిజ్యపరంగా చేపట్టిన ఈ ప్రయోగం కూడా విజయవంతం కావడంతో సంస్థ మరింత ఉత్సాహంగా ఉన్నది. రాబోయే రోజుల్లో సొంత ఉపగ్రహాలే కాకుండా.. వాణిజ్యపరంగా మరిన్ని ఉపగ్రహాలను ప్రవేశపెడతామని సంస్థ తెలిపింది.



Tags:    
Advertisement

Similar News