మళ్లీ మళ్లీ వినియోగించే వాహనం.. ఇస్రో మరో విజయం
రన్ వే పై ల్యాండ్ అయ్యే సమయంలో RLV వెనక ఉన్న ప్యారాచూట్ తెరుచుకుంటుంది. దీంతో వేగ నియంత్రణ సాధ్యమవుతుంది. చివరకు నిదానంగా RLV రన్ వే చివరన ఆగిపోతుంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. మళ్లీ మళ్లీ వినియోగించేలా ఓ లాంచ్ వెహికల్ ని తయారు చేసింది. దాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఆ పునర్వినియోగ లాంచ్ వెహికల్ (RLV) ల్యాండింగ్ ప్రయోగాన్ని ఈ ఉదయం చేపట్టింది. డీఆర్డీవో, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తో కలిసి సంయుక్తంగా RLV ప్రయోగం నిర్వహించింది ఇస్రో. దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో ఉంచారు. బెంగళూరుకు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ఏటీఆర్)లో ఈ ప్రయోగం చేపట్టారు.
ప్రపంచంలోనే తొలిసారి..
పునర్వినియోగ లాంచ్ వెహికల్ ని చాలా దేశాలు ప్రయోగించినా, రెక్కలతో తయారై నేరుగా రన్ వే పై కిందకు సేఫ్టీగా దిగే వెహికల్ ఇస్రో ఘనత అని చెప్పక తప్పదు. హెలికాప్టర్ ద్వారా ఈ RLV ని ఆకాశంలోకి తీసుకెళ్లి.. 4.5 కిలోమీటర్ల ఎత్తున కిందకు వదిలేశారు. అనంతరం ఆకాశం నుంచి సురక్షితంగా రన్ వేపై ల్యాండింగ్ చేశారు. భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా దీన్ని కిందకు వదిలారు. ఇంటిగ్రేటెడ్ నావిగేషన్, గైడెన్స్, కంట్రోల్ సిస్టమ్ ను ఉపయోగించి దానికదే రన్ వేపై ల్యాండ్ అయ్యేట్లు చేశారు.
రన్ వే పై ల్యాండ్ అయ్యే సమయంలో RLV వెనక ఉన్న ప్యారాచూట్ తెరుచుకుంటుంది. దీంతో వేగ నియంత్రణ సాధ్యమవుతుంది. చివరకు నిదానంగా RLV రన్ వే చివరన ఆగిపోతుంది. ఎలాంటి ప్రమాదానికి అవకాశమే లేదు కాబట్టి.. ఇలాంటి వాటిని తిరిగి ఉపయోగించే అవకాశముంటుందని, ఆర్థికంగా ఇవి చాలా ఉపయోగకరమైనవని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.