ప్రభుత్వం మీ వాట్సప్ మెసేజ్ లను చూస్తోందా?

ప్రభుత్వం మన వాట్సప్ చాటింగ్ లపై పర్యవేక్షణ చేస్తోందని అందుకు మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేసిందని సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. నిజంగానే ప్రభుత్వం మన వాట్సప్ మెసేజ్ లను చూస్తూ ఉందా ? వాటి ఆధారంగా చర్యలు తీసుకోవడానికి సిద్దమవుతుందా ?

Advertisement
Update:2022-08-23 12:24 IST

ప్రభుత్వం మన వాట్సప్ మెసేజ్ లను పర్యవేక్షించడానికి, వాటిపై చర్యలు తీసుకోవడానికి మార్గదర్శకాలను జారీ చేసిందని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అందులో నిజముందా ? నిజంగానే వాట్సప్ మెసేజ్ లపై ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోందా?

మనం మరొకరికి వాట్సప్ లో మెసేజ్ పంపినప్పుడు ఒక టిక్ కనపడుతుంది. రెండు టిక్ లు కనపడితే అవతలి వ్యక్తికి ఆ మెసేజ్ చేరిందని అర్దం. బ్లూ టిక్ కనబడితే అవతలి వ్యక్తి ఆ మెసేజ్ ను చూశాడని అర్దం. ఈ బ్లూ టిక్ అనేది ఐచ్ఛికం,వినియోగదారులు దానిని ఆఫ్ చేసుకోవచ్చు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో.... మూడు బ్లూ టిక్ లు వస్తే ప్రభుత్వం మన మెసేజ్ చూసిందని, రెండు బ్లూ టిక్ లు, ఒక రెడ్ టిక్ వస్తే ప్రభుత్వం మన మీద చర్య తీసుకోబోతోందని, మూడు రెడ్ టిక్ లు ఉంటే ప్రభుత్వం మన‌ మీద చర్యలు ప్రారంభించిందంటూ ఓ వార్త వైరల్ అవుతోంది.

అయితే ప్రభుత్వ సమాచార విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ వార్తలను ఖండించింది. ఈ మేరకు తన ఫ్యాక్ట్-చెక్ హ్యాండిల్ లో ట్వీట్ చేసింది. "భారత ప్రభుత్వం చాట్‌లను పర్యవేక్షించడానికి, వ్యక్తులపై చర్య తీసుకోవడానికి కొత్త వాట్సప్ మార్గదర్శకాలను విడుదల చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న‌ సందేశం తప్పు. ప్రభుత్వం అటువంటి మార్గదర్శకాలను విడుదల చేయలేదు.'' అని పేర్కొంది.


వాట్సప్ కూడా ఇప్పటికే మన మెసేజ్ లను వేరొకరు చదివే అవకాశాన్ని తోసిపుచ్చింది. వాట్సప్ లోని మెసేజ్ లన్నీ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ అని పేర్కొంది. మెసేజ్ పంపిన వారు, రిసీవర్ మాత్రమే ఈ మెసేజ్ లను చూడగలరని వాట్సప్ స్పష్టం చేసింది.

కాగా ఇప్పటి వరకు ఇజ్రాయిల్ కు చెందిన స్పైవేర్ సాఫ్ట్ వేర్ పెగాసిస్ వాట్సప్ మెసేజ్ లను చట్టవ్యతిరేకంగా పర్యవేక్షిస్తున్నద‌నే ఆరోపణలున్నాయి. అనేక దేశాల ప్రభుత్వాలు ఈ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసి అక్కడ ప్రభుత్వ వ్యతిరేకులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టుల వాట్సప్ చాటింగుల మీద నిఘా పెడుతున్నాయి. భారతదేశ ప్రభుత్వం కూడా అనేక మంది మేదావులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై పెగాసిస్ ద్వారా నిఘా పెట్టిందనే ఆరోపణలున్నాయి. దీనిపై సుప్రీం కోర్టులో కూడా కేసు నడుస్తోంది. 

Tags:    
Advertisement

Similar News