కాంగ్రెస్ చేస్తున్న ఆరెస్సెస్ వ్యతిరేక పోరాటంలో నిజాయితీ ఉందా?
ఒకరిద్దరు వేళ్ళ మీద లెక్కపెట్టగలిగినంత మందిని వదిలేస్తే కాంగ్రెస్ లో మెజార్టీ నాయకులు ఆరెస్సెస్ భావజాలం ఉన్న వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ లోని ఏ నాయకుడికైనా ఆ పార్టీ నుంచి బీజేపీలో చేరడం పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఆందుకే కాంగ్రెస్ నుండి ఇప్పటికే వందల మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అయ్యారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతి రోజూ ఆరెస్సెస్ పై విరుచుకపడుతూ ఉంటారు. ఆరెస్సెస్ ఈ దేశంలో విద్వేషాన్నినింపుతోందని, ప్రజల మధ్య విభజన తీసుకవస్తోందని ఆయన ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఆరెస్సెస్, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిస్తూ ఉంటారు. అయితే ఆ నినాదాలు, పోరాటం రాహుల్ కుమాత్రమే పరిమితమైందా లేక కాంగ్రెస్ పార్టీ సిద్దాంతపరంగానే ఆరెస్సెస్ భావజాలాన్ని వ్యతిరేకిస్తోందా ?
రాహుల్ గాంధీ మాటలు, చేతలూ చూస్తే అతను నిజాయితీగానే ఆరెస్సెస్ భావజాలంపై పోరాడుతున్నట్టు కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీలోని అనేక మంది పై స్థాయి నేతలు నరనరాన ఆరెస్సెస్ భావజాలంతో ఉన్నారు. ఒకరిద్దరు వేళ్ళ మీద లెక్కపెట్టగలిగినంత మందిని వదిలేస్తే మెజార్టీ అదే భావజాలం ఉన్న వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ లోని ఏ నాయకుడికైనా ఆ పార్టీ నుంచి బీజేపీలో చేరడం పెద్దగా ఇబ్బంది పెట్టదు. అందుకే కాంగ్రెస్ నుండి ఇప్పటికే వందల మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అయ్యారు. ఇక ఈ మధ్య జరిగిన ఓ సంఘటన చూస్తే కాంగ్రెస్ నాయకుల తీరు మనకు మరింత స్పష్టంగా అర్దమవుతుంది.
చత్తీస్ గడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తోంది. అక్కడి ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ రాహుల్ గాంధీకి చాలా దగ్గరివాడు కూడా. మరి అలాంటి బాఘేల్ రాహుల్ భావజాలంతో ఏకీభవిస్తాడా అనేది అనుమానమే. ఈ మధ్య ఆయన ఛత్తీస్‌గఢ్‌లోని కౌశల్య ఆలయాన్ని సందర్శించాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను ఆహ్వానించారు. భగవత్ కూడా సీఎం ఆహ్వానాన్ని మన్నించి ఆలయాన్ని సందర్శించారు. ఛత్తీస్‌గఢ్‌లో రాముడు ప్రవాసంలో గడిపిన సమయంలో ఆయన ప్రయాణించినట్లు నమ్ముతున్న మార్గం ఆధారంగా టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసిన బఘేల్ ప్రభుత్వం, ఈ ఆలయాన్ని కూడా పునరుద్ధరించింది.
ఈ వారం ప్రారంభంలో రాయ్‌పూర్‌లో జరిగిన RSS సమ్మేళనానికి హాజరు కావడానికి భగవత్ రాయ్‌పూర్ వచ్చారు. ఆ సందర్భంగా కౌశల్య ఆలయాన్ని సందర్శించాల్సిందిగా బఘేల్ భగవత్‌ను బహిరంగంగా ఆహ్వానించారు. అనంతరం సీఎం ఓ ట్వీట్‌లో .. ''మాతా కౌశల్య ఆలయాన్ని సందర్శించాల్సిందిగా మోహన్ భగవత్‌ను ఆహ్వానించాం. అక్కడ అతను గొప్ప శాంతి అనుభూతి చెందుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.'' అని అన్నారు. భగవత్‌ను గోఠాన్ (ఆవు ఆశ్రయం,)ను, ఇటీవల సంస్కృతం తప్పనిసరి సబ్జెక్ట్‌గా చేసిన పాఠశాలను కూడా సందర్శించమని కూడా బఘేల్ ఆహ్వానించారు. భగవత్ ను ఆహ్వానించడానికి కాంగ్రెస్ నాయకుడు గిరీష్ దూబేని ముఖ్యమంత్రి ఆయన వద్దకు పంపారు.
ఇది ఆరెస్సెస్ వ్యతిరేక పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కథ. అయితే కథ ఇక్కడితో ఆగిపోలేదు. బఘేల్ , భగవత్ ను ఆహ్వానించడం భగవత్ ఆ ఆలయాన్ని సందర్శించడం బీజేపీకి అస్సలు నచ్చలేదు. రాముడైనా, భగవత్ అయినా తమకు మాత్రమే స్వంతమని, వాళ్ళు తమ బ్రాండ్ అని భావించే బీజేపీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రిపై భగ్గున మండిపడింది.
కాంగ్రెస్ పార్టీ మతాన్ని రాజకీయాలకు వాడుకుంటోందని బీజేపీ విమర్శించింది. భగవత్ తనంతట తానే ఆ ఆలయానికి వెళ్ళారని ఎవరో ఆహ్వానించడం వల్ల కాదని చత్తీస్ గడ్ బీజేపీ నాయకుడు ధరమ్‌లాల్ కౌశిక్ అన్నారు. వాళ్ళు ఆహ్వానించినందుకే భగవత్ వెళ్తే ప్రభుత్వ పెద్దలెవ్వరూ అక్కడ ఎందుకు లేరు అని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు భగవత్ ఒక్క మాతా కౌశల్య ఆలయాన్నే కాదు రాయ్ పూర్ లో గత బీజేపీ ప్రభుత్వం నిర్మించిన రామాలయాన్ని కూడా సందర్శించారని కౌశిక్ అన్నారు. అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం మతాన్ని రాజకీయ సమస్యగా మారుస్తోందని ఆయన ఆరోపించారు.
అంతేకాదు ఎప్పుడూ బీజేపీ వ్యతిరేకులు చేసే వాదనలను ఈ సందర్భంగా బీజేపీ నాయకులు చేస్తున్నారు. కౌశల్య ఆలయాన్ని పునరుద్దరించి, దాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రిని ఉద్దేశించి బిజెపి నాయకుడు అజయ్ చంద్రకర్ కొన్ని ప్రశ్నలు ఎక్కుపెట్టారు. అసలు కౌశల్య అక్కడే పుట్టిందని రుజువులున్నాయా అని ప్రశ్నించారు. "కౌశల్య అక్కడే పుట్టిందని తనకు మాత్రమే ఎలా తెలిసిందో ముఖ్యమంత్రి చెప్పగలరా? కౌసల్య ఇక్కడే పుట్టిందని ఏ గ్రంధంలో రాసి ఉంది?" అని అజయ్ చంద్రకర్ ప్రశ్నించారు.
ఈ వ్యవహారమంతా చూసిన తర్వాత ఆరెస్సెస్ భావజాలంపై పోరాడుతున్నదెవరో ఆ భావజాలాన్ని అనుసరిస్తున్నదెవరో మీకేమైనా అర్దమైందా ? నిజంగానే రాహుల్ గాంధీ ఆరెస్సెస్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడితే బఘేల్ లాంటి వాళ్ళు ఆయనతో పాటు నిలబడతారా ?