అమిత్ షా బెదిరిస్తున్నారా లేక హెచ్చరిస్తున్నారా ?

బెళగావి జిల్లా తెర్డాల్‌లో జరిగిన ఓ ప్రచార సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అల్లర్లతో అతలాకుతలం అవుతుందని, మతకలహాలు తప్పవని అన్నారు.

Advertisement
Update:2023-04-27 09:41 IST

కర్నాటకలో మే 10వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రణరంగంగా మారింది. నాయకుల జంపింగులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, డబ్బు సంచులు, బహుమతులు.... ఒకటేమిటి ప్రస్తుతం అక్కడ ప్రతీది ఎన్నికల‌ టర్గెట్ గానే సాగుతున్నాయి. ఇక సర్వేలన్నీ బీజేపీ ఓటమి ఖాయమని తేల్చి చెప్తుండటంతో బీజేపీ నాయకులు అసహనంతో రగిలిపోతున్నారు. దాంతో వాళ్ళు ఏ‍ మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకే అర్దం కావడం లేదు. లేదంటే అర్దమయ్యే కావాలనే అలా చేస్తున్నారో తెలియదు. అగ్రనాయకులు సైతం మాట్లాడే మాటలు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడమే కాక ప్రజల్లో భయాందోళనలను రెచ్చగొట్టాయి.

బెళగావి జిల్లా తెర్డాల్‌లో జరిగిన ఓ ప్రచార సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అల్లర్లతో అతలాకుతలం అవుతుందని, మతకలహాలు తప్పవని అన్నారు. ''కాంగ్రెస్ గెలిస్తే కర్నాటకలో బుజ్జగింపు రాజకీయాలను మాత్రమే తీసుకువస్తారు. బిజెపిని ఎన్నుకోకపోతే అభివృద్ధి "రివర్స్ గేర్" లోకి జారిపోతుంది. అవినీతి తారాస్థాయికి చేరుకుంటుంది. బీజేపీ మాత్రమే రాష్ట్రాన్ని కొత్త కర్ణాటక వైపు నడిపించగలదు.'' అని షా అన్న‌ట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

అమిత్ షా మాట్లాడిన ఈ మాటలు వివాదాస్పదమవడమే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అమిత్ షా ప్రజలను బెదిరిస్తున్నారని కాంగ్రెస్ ద్వజమెత్తింది. ప్రజలను భయపెట్టి అధికారంలోకి రావాలని బీజేపీ పగటి కలలు కంటున్నదని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ మండిపడ్డారు.

“ఇది దారుణ‌మైన బెదిరింపు ప్రకటన. ఓటమి భయంతో అమిత్ షా ప్రజలపై బెదిరింపులకు దిగుతున్నారు.'' అని జైరాం రమేష్ ఆరోపించారు.

''కర్ణాటకలో బీజేపీ ఓడిపోతోందని ఇప్పుడు స్పష్టమైంది. కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. అందుకే అమిత్ షా... అవమానించడం, రెచ్చగొట్టడం, ప్రేరేపించడం, భయపెట్టడం అనే 4-I వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. దీనిపై మేము ECI కి పిర్యాదు చేస్తాం'' అని జైరాం రమేశ్ అన్నారు.

ఇంతకూ అమిత్ షా మాటల్లో అర్దమేంటి ? తమను ఓడిస్తే మతకలహాలు సృష్టించేది ఎవరని ఆయన ఉద్దేశ్యం? ఇప్పటి వరకు దేశంలో జరిగిన మతకలహాల చరిత్రలో రాజకీయ ప్రయోజనాలకోసం జరిగినవే ఎక్కువ‌. ఒక వేళ కాంగ్రెస్ గెలిస్తే ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం మతకలహాలు జరుగుతాయి ? 

Tags:    
Advertisement

Similar News