ఈవీఎంలతో ఓటింగ్ లో అవకతవకలు
బ్యాలెట్ పేపర్‌తోనే ఎన్నికలు నిర్వహించాలి : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లతో ఎన్నికల్లో అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నాయని.. పేపర్ బ్యాలెట్‌తోనే ఎన్నికలు నిర్వహించాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలోని తల్కతోర స్టేడియంలో నిర్వహించిన సంవిధాన్ రక్షక్ అభియాన్‌లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఎన్నికల నిర్వహణలో ఉపయోగించకుండా ఉండాలంటే దేశంలోని రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈవీఎంల వల్ల దేశంలోని పేదలు, బడుగు, బలహీనవర్గాల వాళ్లు వేసిన ఓట్లు వృథా అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లందరూ కూడా పేపర్ బ్యాలెట్‌తోనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారని అన్నారు. ఈవీఎంలను వాళ్ల దగ్గరే పెట్టుకోమనండి.. తాము ఈవీఎంలను కోరుకోవడం లేదు.. బ్యాలెట్ పేపర్‌తోనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నామని అన్నారు. బ్యాలెట్ పేపర్‌తోనే ఎన్నికలు నిర్వహించేలా ఒత్తిడి తెచ్చేందుకు దేశంలో ఇతర రాజకీయ పార్టీలతో చర్చిస్తామని చెప్పారు. ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం మంగళవారం కొట్టేసింది. ఈవీఎంలలో ఎలాంటి లోపాలు లేవని.. వాటిపై దాఖలు చేసే పిటిషన్లను తాము ఎంటర్‌టైన్ చేయదల్చుకోలేదని సుప్రీం కోర్టు కామెంట్ చేసింది. సుప్రీం కోర్టు ఈవీఎంలపై దాఖలైన పిటిషన్ ను కొట్టేసిన రోజే మల్లికార్జున ఖర్గే వాటికి బదులుగా పేపర్ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.