మగువల అందంలో మనోళ్లే టాప్..! - తాజా అధ్యయనంలో వెల్లడి
ఆయా దేశాల వారికి ర్యాంకులు ఇవ్వగా భారత మహిళలు అందులో టాప్ ప్లేస్‌లో నిలిచారు. పురుషుల్లో మొదటి స్థానంలో బ్రిటన్ నిలవగా, భారతీయ పురుషులకు రెండో స్థానం దక్కింది.
మగువల అందంలో భారతీయులే టాప్ అని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం తేల్చింది. ఇదే అధ్యయనంలో పురుషులకు మాత్రం రెండో స్థానం దక్కింది. యూకేకు చెందిన మల్టీ నేషనల్ వస్త్రాల కంపెనీ `పోర్ మోయి` ఈ అధ్యయనం చేసింది. ఆ అధ్యయనానికి సంబంధించిన నివేదికను తాజాగా విడుదల చేసింది.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ `రెడ్డిట్`లో గత ఏడాది మహిళలు, పురుషుల అందానికి సంబంధించి వచ్చిన లక్షలాది పోస్టులను `పోర్ మోయి` సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా అధ్యయనం చేసింది. వివిధ దేశాల మహిళలు, పురుషుల చిత్రాలతో కూడిన పోస్టులు, వాటిలోని `అట్రాక్టివ్, బ్యూటిఫుల్, హ్యాండ్ సమ్, ప్రిట్టీ, గుడ్ లుకింగ్, గార్జియస్..` వంటి కామెంట్లను.. ఆ పోస్టులకు, చిత్రాలకు వచ్చిన అప్ ఓట్‌లను (ఫేస్‌బుక్‌లో లైక్‌ల తరహాల ఇచ్చేవి) పరిగణనలోకి తీసుకుని ఆ సంస్థ ఈ అధ్యయనం చేసింది.
వాటి ఆధారంగా ఆయా దేశాల వారికి ర్యాంకులు ఇవ్వగా భారత మహిళలు అందులో టాప్ ప్లేస్‌లో నిలిచారు. పురుషుల్లో మొదటి స్థానంలో బ్రిటన్ నిలవగా, భారతీయ పురుషులకు రెండో స్థానం దక్కింది. మహిళల విభాగంలో జపాన్, స్వీడన్ దేశాల మహిళలు రెండు, మూడు స్థానాల్లో నిలవగా, ఆ తర్వాత స్థానాల్లో వరుసగా పోలాండ్, ఇటలీ, బ్రెజిల్, ఉక్రెయిన్, ఫ్రాన్స్, ఇజ్రాయిల్, యూఎస్ఏ వారు ఉన్నారు. పురుషుల విభాగంలో బ్రిటన్, భారత్ తర్వాత.. ఇటలీ, యూఎస్ఏ, స్వీడన్, జపాన్, ఫ్రాన్స్, ఐర్లాండ్ దేశాలు ఉన్నాయి.