బంగ్లాలో రాజకీయ సంక్షోభం.. భారత్ కీలక నిర్ణయం
దౌత్యవేత్తలు మాత్రం బంగ్లాలోనే ఉంటారని, దౌత్య కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే తాజాగా వీసా సెంటర్లను మూసివేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌లోని భారత్ వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసివేసింది. బంగ్లాలో అల్లర్లు కొనసాగుతున్న సందర్భంగా అనేక మంది పౌరులు ఆ దేశాన్ని వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బంగ్లాలోని భారత దౌత్యాధికారులు వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసివేశారు. ఈ మేరకు భారత్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే ఆన్‌లైన్ పోర్టల్‌లో ఓ మెసేజ్‌ని పెట్టారు. బంగ్లాదేశ్ వ్యాప్తంగా అన్ని వీసా దరఖాస్తు సెంటర్లను తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు మూసివేస్తున్నామని, అస్థిర పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, తదుపరి దరఖాస్తు తేదీపై ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారమిస్తామని ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు.
భారత్‌కు బంగ్లాదేశ్‌లోని ఢాకాలో హైకమిషన్‌తో పాటు చిట్టగాంగ్, రాజేషీ, ఖుల్నా, సిల్ హెట్ నగరాల్లో కాన్సులేట్లు ఉన్నాయి. ఇప్పటికే భారత హైకమిషన్, కాన్సులేట్‌లలో పనిచేసే అత్యవసర విధుల్లో లేని సిబ్బందిని, వారి కుటుంబసభ్యులను ఢిల్లీకి తీసుకొచ్చారు. దౌత్యవేత్తలు మాత్రం బంగ్లాలోనే ఉంటారని, దౌత్య కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే తాజాగా వీసా సెంటర్లను మూసివేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోపక్క బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఒడిశా తీరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 480 కిలోమీటర్ల తీర ప్రాంతంలో పటిష్ట నిఘాను ఏర్పాటుచేశారు. చిన్న బోట్లతో బంగ్లాదేశీయులు అక్రమంగా ప్రవేశించే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అల్లర్ల సమయంలో కొందరు నేరస్తులు బంగ్లాదేశ్ జైళ్ల నుంచి బయటికి వచ్చారని ఒడిశా పోలీసులకు సమాచారం అందినట్టు తెలిసింది.