ఇండియా కోడిగుడ్లకు భారీ గిరాకీ.. నెలకు 5కోట్ల ఎగుమతులు

సహజంగా భారత్ నుంచి మధ్య ఆసియా దేశాలకు కోడిగుడ్లు ఎగుమతి అవుతుంటాయి. ఈ విషయంలో మలేసియా మనకు పెద్ద పోటీదారు. అలాంటి దేశం ఇప్పుడు దిగుమతుల కోసం భారత్ వైపు చూస్తోంది.

Advertisement
Update:2023-01-23 16:32 IST

భారత్ నుంచి కోడిగుడ్ల ఎగుమతులు భారీగా పెరిగాయి. ఇప్పుడు భారత్ నుంచి నెలకు 5కోట్ల కోడిగుడ్లు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇదంతా మలేసియా చలవ. అవును మలేసియాలో కోళ్ల దాణా రేటు భారీగా పెరగడంతో అక్కడ కోళ్ల ఫారంల నిర్వహణ ఇబ్బందిగా మారింది. దీంతో కోడిగుడ్ల ఉత్పత్తి కూడా తక్కువైంది. భారత్ నుంచి దిగుమతి చేసుకోడానికి అక్కడి ప్రభుత్వం ఆసక్తి చూపించింది.


ఇటీవలే మలేసియా వ్యవసాయ శాఖ మంత్రి తమిళనాడు లోని నమక్కల్ ప్రాంతానికి వచ్చి అక్కడి హేచరీల యజమానులతో నేరుగా మాట్లాడి వెళ్లారు. దీంతో మలేసియాకి భారత్ నుంచి కోడిగుడ్ల ఎగుమతికి భారీ డీల్ కుదిరింది.

సహజంగా భారత్ నుంచి మధ్య ఆసియా దేశాలకు కోడిగుడ్లు ఎగుమతి అవుతుంటాయి. ఈ విషయంలో మలేసియా మనకు పెద్ద పోటీదారు. మలేసియా నుంచి సింగపూర్ సహా ఇతర ఆసియా దేశాలకు గుడ్లు ఎగుమతి అవుతుంటాయి. అలాంటి దేశం ఇప్పుడు దిగుమతుల కోసం భారత్ వైపు చూస్తోంది. రాజుగారి ఏడు చేపల కథలాగా.. మలేసియా భారత్ సాయాన్ని కోరడం వెనక పెద్ద కారణే ఉంది.


రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కొన్నాళ్లుగా మలేసియాకి కోళ్ల మేత సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల ఈ ఇబ్బంది బాగా పెరిగింది. దీంతో మేత విషయంలో రాజీపడిన మలేసియా ప్రభుత్వం కోడి గుడ్ల దిగుమతికి మొగ్గు చూపింది. అది అనుకోకుండా భారత్ కి వరంగా మారింది.

గతేడాది డిసెంబర్ లో భారత్ నుంచి మలేసియాకి 50లక్షల కోడిగుడ్లు ఎగుమతి అయ్యాయి. జనవరిలో కోటి గుడ్లు, ఫిబ్రవరి చివరి నాటికి కోటిన్నర గుడ్లు ఎగుమతి అవుతాయని అంచనా. ఇప్పుడు భారత్ లో కూడా కోడిగుడ్ల రేట్లు భారీగా పెరుగుతున్నాయి.


మలేసియానుంచి వచ్చే ఆదాయంతోపాటు, దేశీయంగా కూడా గుడ్ల రేట్లు భారీగా పెరగడంతో హేచరీస్ బిజినెస్ కళకళలాడుతోంది. త్వరలో శ్రీలంక, సింగపూర్ కూడా భారత్ నుంచి కోడిగుడ్లను దిగుమతి చేసుకునే అవకాశం కనిపిస్తోందని నమక్కల్ లోని హేచరీస్ యజమానులు చెబుతున్నారు. 

Tags:    
Advertisement

Similar News