ఇండియా భేటీ ముగిసింది.. ఎన్డీఏ మీటింగ్ మొదలైంది

ఢిల్లీలోని అశోకా హోటల్‌ ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం మొదలైంది. విపక్షాల కూటమి, వారి ఎత్తుగడలపై కూడా NDA కూటమిలో కీలక చర్చ జరిగే అవకాశముంది.

Advertisement
Update:2023-07-18 18:09 IST

బెంగళూరులో విపక్షాల కూటమి(INDIA) సమావేశం ఈరోజుతో ముగిసింది. ఈ సాయంత్రం నుంచి ఢిల్లీలో అధికార పక్ష కూటమి (NDA) సమావేశం మొదలైంది. దేశ రాజకీయాల్లో ఈరోజు జరిగిన కీలక పరిణామాలివి. పాత మిత్రులందర్నీ కలుపుకొని అధికారాన్ని నిలబెట్టుకోడానికి బీజేపీ ఆపసోపాలు పడుతోంది. దాదాపు పదేళ్లు అధికారానికి దూరమైన విపక్ష కూటమి ఈసారి విజయంపై ధీమాగా ఉంది. కూటమి రాజకీయాల్లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

రాహుల్ ఏమన్నారంటే..?

బీజేపీ సిద్దాంతాలపైనే విపక్ష కూటమి పోరాటం చేస్తుందని అన్నారు రాహుల్ గాంధీ. ఇది బీజేపీ, విపక్ష పార్టీల మధ్య యుద్ధం కాదని, దేశ ప్రజల స్వతంత్రం,స్వేచ్ఛ కోసం చేస్తున్న యుద్ధంగా ఆయన పేర్కొన్నారు. తమ పోరాటం ఎన్డీఏ వర్సెస్ ఇండియాగా ఉంటుందన్నారు. అధికారం కోసం దేశాన్ని ఆక్రమించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.


తదుపరి మీటింగ్ ముంబైలో..

దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందన్న రాహుల్, దేశం కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఆలోచనపై దాడి జరుగుతోందని ఆరోపించారు. కోట్లాది మంది భారతీయుల నుంచి భారత స్వరాన్ని లాక్కొని మోదీకి సన్నిహితంగా ఉండే కొద్దిమంది వ్యాపారులకు ఇస్తున్నారని అన్నారు. ఇండియాను రక్షించుకునేందుకు తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్‌ కార్యాచరణను ముంబైలో జరిగే తదుపరి సమావేశంలో ప్రకటిస్తామన్నారు రాహుల్.


ఢిల్లీలో NDA మీటింగ్ మొదలు..

అటు ఢిల్లీలోని అశోకా హోటల్‌ ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం మొదలైంది. ఈ భేటీకి 38 భాగస్వామ్య పార్టీలు హాజరవుతున్నాయని ఇది వరకే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. దాదాపుగా అందరూ సమావేశానికి హాజరవుతున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న NDA భాగస్వామ్యపక్షాలు దేశ రాజధానిలో ఒకేచోట సమావేశం కావడం ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు ప్రధాని మోదీ. దేశం మరింత అభివృద్ధిపథంలో దూసుకెళ్లాలని భాగస్వామ్య పక్షాలు కోరుకుంటున్నాయని తెలిపారు. ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా విశ్వసనీయత కలిగిన కూటమి తమదని పేర్కొన్నారు. విపక్షాల కూటమి, వారి ఎత్తుగడలపై కూడా NDA కూటమిలో కీలక చర్చ జరిగే అవకాశముంది. 



Tags:    
Advertisement

Similar News