చిన్నారుల‌ విద్యపై కేంద్రం చిన్న చూపు

కేంద్ర ప్రభుత్వం బాల‌ల విద్యపై అతి తక్కువ ఖర్చు పెడుతోందని 'సెంటర్ ఫర్ బడ్జెట్ అండ్ గవర్నెన్స్ అకౌంటబిలిటీ' విడుదల చేసిన నివేదిక పేర్కొంది. మూడు నుండి ఆరు సంవత్సరాల వయస్సు గల పిల్లల విద్య కోసం 2020-21లో జిడిపిలో 0.1 శాతం మాత్రమే ఖర్చు చేసిందని నివేదిక స్పష్టం చేసింది.

Advertisement
Update:2022-09-21 19:28 IST

స‌బ్ కా సాథ్ స‌బ్ కా వికాస్ అంటూ ఊద‌ర‌గొడుతున్న న‌రేంద్ర‌మోడీ నేతృత్వంలోని భార‌తీయ‌జ‌న‌తా పార్టీ (బిజెపి) ప్ర‌భుత్వం బాల‌ల విద్యా వికాసాల‌పై మాత్రం చిన్న చూపు చూపిస్తోంది. బాల్య విద్య పై నామ‌మాత్ర‌పు కేటాయింపులు మాత్ర‌మే చేస్తూ చేతులు దులుపుకుంటోంది.

భారతదేశం 2020-21లో బాల్య విద్య కోసం తన జిడిపిలో 0.1 శాతం మాత్రమే ఖర్చు చేసింద‌ని సెంటర్ ఫర్ బడ్జెట్ అండ్ గవర్నెన్స్ అకౌంటబిలిటీ (సిబిజిఎ), లాభాపేక్షలేని సేవ్ ది చిల్డ్రన్ ఫౌండేషన్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. మూడు నుండి ఆరు సంవత్సరాల వయస్సు గల పిల్లలకు విద్యనందించ‌డాన్ని బాల్య విద్య అంటారు.

భారతదేశంలో యూనివర్సలైజింగ్ ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ (ఈసిఈ) ఖర్చుపై ఈ నివేదిక రూపొందించారు. భారతదేశంలో అత్యధికంగా 3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల సంఖ్య 9.9 కోట్ల కంటే ఎక్కువగా ఉందని పేర్కొంది.

నివేదిక ఏమి సూచిస్తుంది?

నివేదిక ఆధారంగా, భారతదేశం 2020-21లో ఈసిఈ సేవలపై ఒక్కో చిన్నారికి రూ. 8,297 మాత్రమే ఖర్చు చేసింది. 2030 నాటికి ఈసీఈ సార్వత్రికీకరణను సాధించడానికి భారతదేశం అంగన్‌వాడీలో సంవత్సరానికి కనీసం రూ. 32,500, ప్రీ-ప్రైమరీలో సంవత్సరానికి రూ. 46,000 ఖర్చు చేయవలసి ఉంటుందని అంచనా వేశారు. భారతదేశం జిడిపిలో 1.5 శాతం నుండి 2.2 శాతం కేటాయిస్తే మాత్రమే ఇది సాధించగలదని పేర్కొంది.

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ ఈపి) 2020 ప్రకారం, 2030 నాటికి ఉన్నతస్థాయి నాణ్యత గల బాల, బాలికల‌ అభివృద్ధి, సంరక్షణ, విద్య ను దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తేవాలి. అయితే, మొత్తం ప్రభుత్వ వ్యయంలో 1.4 శాతం ఈసీఈ పై ఖర్చు చేయాలని ఎన్ ఈపి గ‌త నివేదిక‌లో సూచించినప్పటికీ, ప్ర‌భుత్వం నిధుల కేటాయింపుపై మౌనంగా ఉందని తాజా నివేదిక పేర్కొంది.

ఈసీఈ సేవ‌ల‌కు కోవిడ్-19 మహమ్మారికి ముందు, 2018-19, 2019-20లో మొత్తం బడ్జెట్ కేటాయింపుల శాతం 0.44 శాతంగా ఉండ‌గా, 2020-21లో మొత్తం బడ్జెట్ కేటాయింపులో 0.39 శాతం మాత్రమేన‌ని నివేదిక‌ పేర్కొంది.

కాగా బాల బాలికల  విద్య‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అత్య‌ధికంగా నిధులను ఖర్చు చేస్తోంద‌ని నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్ 2020-21లో ఒక్కో బిడ్డకు రూ.34,758 ఖర్చు చేస్తుండ‌గా ఆ త‌ర్వాత వ‌ర‌స‌లో హిమాచల్ ప్రదేశ్ రూ.26,396, సిక్కిం రూ.24,026 ఖర్చు చేశాయి. ఇదిలా ఉండగా, 2020-21లో మేఘాలయ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లు ఒక్కో చిన్నారికి ఈసీఈ సేవలపై అతి తక్కువ ఖర్చు చేశాయి. మేఘాలయ ఒక్కో చిన్నారికి రూ.3,792 మాత్రమే ఖర్చు చేయగా, పశ్చిమ బెంగాల్ రూ.5,346, ఉత్తరప్రదేశ్ రూ.6,428 ఖర్చు చేసింది.

2030 నాటికి బాల్య విద్య ను మెరుగ్గా అందుబాటులోకి తెచ్చేందుకు ఆయా విద్యా సంస్థల స్థాయిని బట్టి పిల్లల నిర్వహణ ఖర్చులను రూ. 32,5000 నుండి రూ. 50,000 మధ్య పెంచాల‌ని తెలిపింది. 14 వేర్వేరు ఈసీఈ సంస్థల నుంచి సేక‌రించిన శాంపిల్స్ ఆధారంగా, స్వతంత్ర అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లల నిర్వహణ ఖర్చులు రూ. 32,529 నుంచి రూ. 45,759, ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రీ-ప్రైమరీ విభాగాలలో రూ. 46,294 నుంచి రూ. 49,159 మధ్య ఉండాలని అధ్యయనం అంచనా వేసింది. స్వతంత్ర ప్రీ-స్కూళ్ళు, డే-కేర్ సెంటర్‌లు ఈ ప్రయోజనం కోసం ఒక్కో చిన్నారికి రూ.36,524 నుండి రూ.56,328 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంద‌ని పేర్కొంది.

Tags:    
Advertisement

Similar News