మనోళ్లు సంతోషంగా లేరు.. హ్యాపీనెస్ ఇండెక్స్‌లో ఇండియాకు 126వ స్థానం
పొరుగునున్న నేపాల్.. అంతెందుకు జీవన ప్రమాణాల్లో మనకంటే చాలా దిగువన ఉన్న పాకిస్తాన్ కన్నా ర్యాంకింగ్స్‌లో మనం దిగజారిపోయాం.
పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, అప్పులు, కాలుష్యం, అనారోగ్యం.. ఇలా మనల్ని నిత్యం చాలా సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఇక వీటన్నింటి మధ్యలో ఆనందానికి చోటెక్కడుందంటున్నారు జనాలు. ఫస్ట్ తారీఖు వరకు జీతం కోసం ఎదురుచూపులు, అది వచ్చాక తీర్చలేనన్ని అప్పులు ఇలా సగటు భారతీయుడి జీవితం గడిచిపోతోంది. తాజాగా వచ్చిన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ దీన్ని రుజువు చేసింది. ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్న 143 దేశాల జాబితా తయారుచేస్తే అందులో మన స్థానం 126.
ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్
ఈ రోజు (మార్చి 20) ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ (అంతర్జాతీయ ఆనంద దినోత్సవం). ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్‌ను ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆత్మసంతృప్తి, తలసరి ఆదాయం, జీవనకాలం, స్వేచ్ఛ, దాతృత్వం ఇలాంటి అంశాల ప్రాతిపదికగా 143 దేశాల ప్రజల అభిప్రాయాలు తీసుకుని ఇండెక్స్ రూపొందించారు. ఫిన్లాండ్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ దేశం హ్యాపీయస్ట్ కంట్రీగా ఎంపికవడం ఇది వరుసగా ఏడోసారి. రెండు, మూడు స్థానాల్లో నార్వే, ఐస్‌ల్యాండ్ నిలిచాయి.
పాకిస్తాన్ కంటే దిగజారిపోయాం
పొరుగునున్న నేపాల్.. అంతెందుకు జీవన ప్రమాణాల్లో మనకంటే చాలా దిగువన ఉన్న పాకిస్తాన్ కన్నా ర్యాంకింగ్స్‌లో మనం దిగజారిపోయాం. పాక్ ర్యాంకు 118 అయితే మనది 126. నిరుటి కంటే ఇంకో స్థానం కిందికి వచ్చేశాం.