పాకిస్తాన్‌కు భారత్ వరద సాయం..!
పాక్ కు సాయం అందించడంపై ఇంకా ఇండియా ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ, సాయం అందించేందుకు మోదీ ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఆ దేశంలోని దాదాపు సగానికిపైగా ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. అసాధారణ రుతుపవన ప్రభావం కారణంగా జూలై నుంచి ఆ దేశంలో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు దేశంలోని 150 జిల్లాల్లో 110 చోట్ల వరదలు వచ్చినట్టు పాక్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ) వెల్లడించింది. 2010లో పాకిస్తాన్ చూసిన సూపర్ ఫ్లడ్ కంటే ఇది తీవ్రమైనది. ప్రస్తుత వరదల కారణంగా ఆ దేశంలో ఇప్పటి వరకు 1061 మంది మరణించారు. 4,52,000 ఇళ్లు దెబ్బతిన్నాయి. మొత్తం 2,18,000 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో మెరుపు వరదల కారణంగా వేల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. దాదాపు 8 లక్షల పశువులు చనిపోగా, 20 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టు ఎన్‌డీఎంఏ పేర్కొంది. ఎనిమిది వారాలుగా పాకిస్తాన్ లోని అనేక ప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉండటం గమనార్హం.
భారీ వర్షాల కారణంగా పాకిస్తాన్‌లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు పేర్కొంటున్నారు. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్ధారీ మాట్లాడుతూ.. చనిపోయిన వారిలో మూడింట ఒకవంతు మంది పిల్లలే ఉన్నారని భావిస్తున్నామని చెప్పారు. దేశంలోని ఉత్తర్ స్వాత్ లోయలో భారీ వరదల కారణంగా వంతెనలు, రోడ్లు కొట్టుకుపోయాయి. పాక్ లో వరదల కారణంగా సహాయక చర్యల కోసం యూకే ప్రభుత్వం 1.8 మిలియన్ డాలర్లు ఆర్థిక సాయం అందించింది. మరోపక్క పొరుగుదేశమైన పాక్ వరదలతో అతలాకుతలం అవుతుండటంతో భారత్ సాయం అందించేందుకు సిద్ధమవుతోంది.
వరదలతో అతలాకుతలం అవుతున్న పాకిస్తాన్ కు మానవతా సహాయం అందించే అవకాశంపై అత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. అయితే పాక్ కు సాయం అందించడంపై ఇంకా ఇండియా ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ, సాయం అందించేందుకు మోదీ ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ లో వరదల బీభత్సాన్ని ఉద్దేశించి భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. పాకిస్తాన్ లో వరదల కారణంగా సంభవించిన విధ్వంసం చూసి బాధపడ్డానని, ఈ ప్రకృతి వైపరీత్యంలో బాధిత కుటుంబాలకు, గాయపడిన వారికి, నష్టపోయిన వారందరికీ తమ హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. త్వరగా ఆ దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవాలని ఆశిస్తున్నట్టు ప్రధాని తెలిపారు.
పాకిస్తాన్‌కు భారత్ సాయం చేయడమే గనుక జరిగితే.. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రకృతి విపత్తు కారణంగా పాకిస్తాన్ కు భారత్ సాయం చేయడం ఇదే తొలిసారి అవుతుంది. గతంలో అప్పటి యూపీ ప్రభుత్వ హయాంలో 2010లో వరదలకు, 2005లో భూకంపానికి భారత్ పాకిస్తాన్ కు సహాయం చేసింది.