ఆరు పంటలకు మద్దతు ధర పెంపు

కాశీలో గంగా నదిపై కొత్తగా సిక్స్‌ లేన్‌ బ్రిడ్జి నిర్మాణం.. కేంద్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం

Advertisement
Update:2024-10-16 17:32 IST

రైతులకు కేంద్ర కేబినెట్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రబీ సీజన్‌ లో ఆరు పంటల మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బుధవారం నిర్వహించిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ మీడియాకు వెళ్లడించారు. ఆవాలకు క్వింటాల్‌ కు ప్రస్తుత మద్దతు ధర రూ.5,650లు ఉండగా, రూ.300 పెంచారు. పెసలకు రూ.275, శెనగలకు రూ.210, గోధుమలకు రూ.150, పొద్దు తిరుగుడుకు రూ.140, బార్లీకి రూ.130 చొప్పున మద్దతు ధర పెంచారు. ఈ పెంపుతో క్వింటాల్‌ పెసల ధర రూ.6,700, శెనగల ధర రూ.5,650, గోధుమల ధర రూ.2,425, బార్లీ ధర రూ.1,980, పొద్దు తిరుగుడు ధర రూ.5,940లకు చేరనుంది. మద్దతు ధరల పెంపుతో రైతులకు రూ.87,567 కోట్ల ప్రయోజనం కలుగనుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. పీఎం అన్నదాత ఆయ్‌ సంరక్షణ్‌ అభియాన్‌ కు రూ.35 వేల కోట్లు కేటాయిస్తామని తెలిపారు. ప్రస్తుత రబీ సీజన్‌ లో వ్యవసాయం కోసం ఉపయోగించే యూరియా యేతర ఎరువుల సబ్సిడీ కోసం రూ.24,475 కోట్లు ఇస్తామన్నారు. కాశీ (వారణాసి)లో గంగా నదిపై రూ.2,642 కోట్లతో రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జి నిర్మిస్తామని తెలిపారు. గంగా నదిపై 137 ఏళ్ల క్రితం నిర్మించిన మాలవ్య రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జి ఒక్కటే ఉందని, దానికి ప్రత్యామ్నాయంగా ఆరు లైన్ల హైవే, నాలుగు లైన్ల రైల్వే బ్రిడ్జి నిర్మిస్తామన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే యేటా రూ.638 కోట్ల విలువైన ఫ్యూయల్‌ ఆదా చేయవచ్చని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News