వినాయక చవితి:కర్నాటక హైకోర్టు అర్దరాత్రి సంచలన ఉత్తర్వులు... టెన్షన్ వాతావరణం

బెంగుళూరు ఈద్గా మైదానంలో వినాయక చవితి ఉత్సవాలు జరపాలన్న ప్రభుత్వ ఆలోచనలకు సుప్రీం కోర్టు చెక్ పెట్టిన కొన్ని గంటల్లోనే మరో చోట వివాదం లేవదీసింది కర్నాటక ప్రభుత్వం. ధార్వాడ్ మునిసిపాలిటీ లోని హుబ్బళ్లి ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి ఉత్సవాలను జర్పడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీన్ని హైకోర్టు కూడా సమర్దించింది.

Advertisement
Update:2022-08-31 08:45 IST

బెంగుళూరు ఈద్గా మైదానంలో వినాయక చవితి ఉత్సవాలను జరపడానికి వీలు లేదని సుప్రీం కోర్టు నిన్న తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కర్నాటకలో అర్ద‌రాత్రి మరో పరిణామం జరిగింది. ఎన్నికలకు ముందు ఎలాగైనా మత పోలరైజేషన్ జరగాలని తీవ్రంగా ప్రణాళికలు రచిస్తున్న బీజేపీ మరో చోట రచ్చ సృష్టించడానికి రెడీ అయ్యింది.

ధార్వాడ్ మునిసిపాలిటీ లోని హుబ్బళ్లి ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి ఉత్సవాలను జర్పడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దానిపై అంజుమన్-ఏ-ఇస్లాం హై కోర్టులో సవాలు చేయగా, మంగళవారం అర్థరాత్రి జరిగిన విచారణలో హుబ్బళ్లి ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి ఉత్సవాలకు అనుమతినిచ్చిన‌ ధార్వాడ్ మున్సిపల్ కమిషనర్ ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు సమర్థించింది. ఉత్సవాలు జరుపుకోవడానికి అనుమతి ఇచ్చింది.

హుబ్బళ్లి ఈద్గా మైదానం ధార్వాడ్ మునిసిపాలిటీకి చెందినదని, అంజుమన్-ఇ-ఇస్లాం సంవత్సరానికి 1 రూపాయి రుసుముతో 999 సంవత్సరాల కాలానికి లీజు మాత్రమే తీసుకుంద‌ని జస్టిస్ అశోక్ ఎస్ కినాగి పేర్కొన్నారు.

బెంగుళూరు చామ్‌రాజ్‌పేట ఈద్గా మైదానంలో యథాతథ స్థితికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ కేసుకు వర్తించదని హైకోర్టు పేర్కొంది.

చామ్‌రాజ్‌పేట అంశంలో ఆస్తి యాజమాన్యం వివాదం ఉందని, అయితే హుబ్బళ్లి మైదానం మున్సిపాలిటీకి చెందినదని, దీనిని అంజుమన్-ఎ-ఇస్లాం కూడా అంగీకరించిందని కోర్టు ఎత్తిచూపింది.

ఇటు రాష్ట్రప్రభుత్వం, అటు అంజుమన్-ఏ-ఇస్లాం పక్షాల వాదనలు విన్న తర్వాత రాత్రి 11.15 గంటలకు జస్టిస్ అశోక్ ఎస్ కినాగి ఉత్తర్వులు జారీ చేశారు.

బెంగుళూరు ఈద్గా వివాదానికి సుప్రీం కోర్టు చెక్ పెట్టిందనుకుంటే ఇప్పుడు ధార్వాడ్ లోని హుబ్బళ్లి ఈద్గా మైదానం విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నడూ లేని విధంగా ముస్లింల స్థలాల్లో వినాయక చవితి ఉత్సవాలు జరపాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించడం వల్ల వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు సిద్దిస్తాయేమో కానీ ప్రజల మధ్య వైషమ్యాలు, విద్వేశాలు పెరిగే అవకాశం మాత్రం ఉంది.

Tags:    
Advertisement

Similar News