మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్థికల నిమజ్జనం
యమునా నది సమీపంలోని 'మజ్ను కా తిలా' గురుద్వారా సమీపంలో సిక్కు సంప్రదాయం ప్రకారం అస్థికలను నిమజ్జనం చేసిన కుటుంబసభ్యులు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్థికలను యమునా నదిలో నిమజ్జనం చేశారు. శనివారం ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగ్గా.. ఆదివారం ఉదయం అక్కడి నుంచి ఆయన కుటుంబసభ్యులు అస్థికలను సేకరించారు. అనంతరం యమునా నది సమీపంలోని 'మజ్ను కా తిలా' గురుద్వారా సమీపంలో కుటుంబసభ్యులు సిక్కు సంప్రదాయం ప్రకారం ఆయన అస్థికలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరణ్ కౌర్, కుమార్తెలు ఉపిందర్ సింగ్, దమన్ సింగ్, అమృత్‌సింగ్‌తో పాటు బంధువులు పాల్గొన్నారు.
ఆచారాల్లో భాగంగా జనవరి 1న ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని మన్మోహన్ సింగ్ అధికారిక నివాసంలో అఖండ్ పథ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 3వ తేదీన పార్లమెంటు కాంప్లెక్స్ సమీపంలోని రకాబ్ గంజ్ గురుద్వారా వద్ద భోగ్ వేడక, అంతిమ్ అర్దాస్, కీర్తన్ జరగనున్నాయి. వయో సంబంధిత సమస్యలతో మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26న ఢిల్లీ ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచిన విషయం విదితమే.