మస్తు వర్షాలు పడతాయ్.. మంచిమాట చెప్పిన ఐఎండీ
దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 87 సెం.మీ. ఈ ఏడాది ఆ సగటు దాటి 105 శాతం వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ప్రస్తుతం మధ్య పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఎల్‌నినో కొనసాగుతోంది.
గత ఏడాది సరైన వర్షాల్లేకపోవడంతో బోర్లు బావురుమంటున్నాయి. బెంగళూరు లాంటి నగరాల్లో నీటి కొరతతో జనం అల్లాడిపోతున్నారు. హైదరాబాద్‌లోనూ బోర్లు నోళ్లు తెరుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది సగటు వర్షపాతం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
సగటు కంటే ఎక్కువ
దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 87 సెం.మీ. ఈ ఏడాది ఆ సగటు దాటి 105 శాతం వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ప్రస్తుతం మధ్య పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఎల్‌నినో కొనసాగుతోంది. ఎల్‌నినో ప్రభావంతో ఈ వేసవిలో ఎండలు దంచి కొడతాయని.. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని ఐఎండీనే కాదు ప్రపంచ వాతావరణ సంస్థలన్నీ హెచ్చరిస్తున్నాయి. అయితే ఎల్‌నినో మెల్లగా తొలగిపోతూ రుతుపవనాలు ప్రారంభమయ్యేసరికి తటస్థ స్థితి ఏర్పడుతుందని ఐఎండీ వెల్లడించింది.
జూన్ నెలాఖరు నుంచే చల్లబడుతుందా?
ఎల్‌నినో ప్రభావం ఈ వేసవి వరకే ఉంటుందన్న స్కైమేట్ తదితర వాతావరణ సంస్థల అంచనాలు, ఇప్పుడు రుతుపవనాలు వచ్చేసరికే ఎల్‌నినో తొలగిపోతుందన్న ఐఎండీ ప్రకటనలు ఆశావహ వాతావరణాన్ని ఏర్పరుస్తున్నాయి. జూన్ నెలాఖరుకే వాతావరణం చల్లబడుతుందన్న ఆశలు కనిపిస్తున్నాయి.