మా ప్రభుత్వం వస్తే ముంబయ్ లోని అంబానీ ఇల్లు కూలగొడతాం -కేజ్రీవాల్
తాము అధికారంలోకి వస్తే ముంబయ్ లో అక్రమంగా నిర్మించుకున్న అంబానీ ఇల్లు కూల్చి వేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ట్వీట్టర్ లో ఈ రోజు తాజేందర్ పాల్ సింగ్ బగ్గా అనే బీజేపీ నాయకుడు కేజ్రీవాల్ కు సంబంధించిన ఓ వీడియో పోస్ట్ చేశారు. అంబానీ ఇల్లు కూలగొడతానంటూ కేజ్రీవాల్ మాట్లాడిన ఆ వీడియోలోని మాటలు ట్విట్టర్ లో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియో ఎప్పడు రికార్డ్ చేశారు అనే వివరాలు మాత్రం లేవు. ఇది వక్ఫ్ బోర్డు కార్యక్రమం అనేది మాత్రం తెలుస్తున్నది.
ముంబయ్ లో ఉన్న దేశంలోని అత్యంత ధనవంతుడి(అంబానీ) ఇల్లు వక్ఫ్ బోర్డు స్థలాన్ని ఆక్రమించి కట్టారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అక్కడ ఉన్న ప్రభుత్వానికి ఆ ఇంటిని కూల గొట్టే దమ్ము లేదని అదే తమ ప్రభుత్వం ఉంటే వెంటనే ఆ ఇల్లు కూలగొట్టేవాళ్ళమని కేజ్రీవాల్ అన్నారు.
తాను అన్ని వేళలా మనసా వాచా వక్ఫ్ బోర్డుకు మద్దతుగా నిలబడతానని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తన తలుపు తట్టాలని కేజ్రీవాల్ అన్నారు.
దీనిపై బీజేపీ నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు. అంబానీ వంటి వ్యక్తి ఇల్లునే కూల్చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు నెటిజనులు మాత్రం ఇల్లు అక్రమమైనప్పుడు ఎవరిదైనా కూల్చివేయాల్సిందే అని వ్యాఖ్యానిస్తున్నారు.