కేంద్రమంత్రి పదవి నేనడగలేదు.. నాకొద్దు - కేరళ బీజేపీ ఎంపీ

తనకు కేంద్ర మంత్రి పదవి కావాలని తాను అడగలేదని.. తనకు అవసరం లేదని కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఒకరోజు వ్యవధిలోనే కేరళ బీజేపీ ఎంపీ సురేష్ గోపి ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Advertisement
Update: 2024-06-10 09:54 GMT

తనకు కేంద్ర మంత్రి పదవి కావాలని తాను అడగలేదని.. తనకు అవసరం లేదని కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఒకరోజు వ్యవధిలోనే కేరళ బీజేపీ ఎంపీ సురేష్ గోపి ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కేరళలో సురేష్ గోపి అగ్ర కథానాయకుడిగా ఉన్నారు. ఆయన ఇప్పటివరకు మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 250కి పైగా సినిమాల్లో నటించారు.

గతంలో బీజేపీ తరఫున రాజ్యసభ ఎంపీగా పనిచేసిన సురేష్ గోపి ఈసారి కేరళలోని త్రిశూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. కేరళలో ఎంపీ స్థానం దక్కడం బీజేపీకి ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వంలో సురేష్ గోపికి కేబినెట్ మంత్రిగా అవకాశం కల్పించారు.

కేంద్ర మంత్రిగా సురేష్ గోపి ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. కాగా, ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తనకు కేంద్రమంత్రి పదవిపై ఆసక్తి లేదని చెప్పారు. తనకు మంత్రి పదవి కావాలని తాను అడగలేదని, తనకు ఈ పదవి అవసరం లేదని తెలిపారు. ఈ మేరకు పార్టీకి సమాచారం కూడా అందించినట్లు సురేష్ గోపి వెల్లడించారు.

తాను ఒప్పుకున్న చాలా సినిమాలను పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. కేవలం ఎంపీగా తన నియోజకవర్గానికి పనిచేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. తాను ఈ పదవిని కోరుకోలేదని, త్వరలోనే ఈ పదవి నుంచి రిలీవ్ అవుతానని వెల్లడించారు. కేంద్ర కేబినెట్ లో చోటు దక్కితే చాలని దేశంలోని చాలామంది ఎంపీలు ఎదురుచూస్తుండగా.. మంత్రి పదవి దక్కినప్పటికీ.. తనకు ఆ పదవి అవసరం లేదని.. త్వరలో పదవి నుంచి వైదొలుగుతానని సురేష్ గోపి ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

Tags:    
Advertisement

Similar News