మా నాన్న కాంగ్రెస్ మనిషే.. జోడో యాత్రలో కమల్ హాసన్
నేను ఒక భారతీయుడిగా ఈ యాత్రలో పాల్గొన్నానని నటుడు కమల్ హాసన్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఢిల్లీకి చేరుకున్నది. కన్యాకుమారి నుంచి మొదలు పెట్టి ఇప్పటికే దాదాపు 3000 కిలోమీటర్ల నడక సాగించిన రాహుల్.. జనవరి చివర్లో కశ్మీర్‌లో యాత్రను ముగించనున్నారు. దేశ రాజధానికి చేరుకోవడంతో అనేక మంది ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, రాహుల్ తల్లి సోనియా గాంధీ కూడా అతడిని కలిశారు. ఇక సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కూడా రాహుల్‌తో కలిసి నడిచారు. ఢిల్లీ వీధుల్లో రాహుల్ వెంట ఎర్రకోట వరకు నడిచి వెళ్లిన కమల్.. అక్కడ నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు.
'కాంగ్రెస్ పార్టీ నేత చేపట్టిన భారత్ జోడో యాత్రకు ఎందుకు వచ్చావని నన్ను చాలా మంది అడిగారు. వారందరికీ నేను ఒకటే సమాధానం చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక భారతీయుడిగా ఈ యాత్రలో పాల్గొన్నాను. మా నాన్న ఓ కాంగ్రెస్ లీడర్. అయినా సరే రాజకీయాలపై నాకంటూ ఒక ప్రత్యేకమైన ఐడియాలజీ ఉన్నది. అందుకే నేను కొత్త పార్టీని స్థాపించాను. అయితే దేశ ఐక్యత అనే విషయంలో మాత్రం రాజకీయాలు దాటుకొని రావల్సిన అవసరం ఉంది. ఆ సరిహద్దులను చెరిపేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ గీతను చెరిపేయడానికే రాహుల్‌తో కలిసి నడవడానికి వచ్చాను' అంటూ కమల్ హాసన్ భావోద్వేగంగా ప్రసంగించారు.
గత వారమే తనను కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు రాహుల్ ఇన్వైట్ చేశారు. అప్పుడు అద్దం ముందు నిలబడి నన్ను నేను ప్రశ్నించుకున్నానని కమల్ చెప్పారు. దేశానికి నా అవసరం ఉందని అంతరాత్మ చెప్పింది. భారత్ ముక్కలవడం సరికాదని, ఐక్యమత్యంగా ఉండాల్సిన సమయమని కమల్ అన్నారు. కాగా, ఎర్రకోట వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్నది మోడీ ప్రభుత్వం కాదని, ఇది అంబానీ, అదానీ ప్రభుత్వమని మండిపడ్డారు. జోడో యాత్రలో అనేక కిలోమీటర్లు నడిచిన తాను ఎందరినో కలిశాను. ఎంతో మందితో మమేకం అయ్యాను. కానీ నాకెక్కడా విద్వేషం, హింస కనిపించలేదని రాహుల్ చెప్పారు.
అయితే ప్రశాంతంగా ఉన్న భారత్‌లో బీజేపీ కావాలనే విద్వేషాలను రెచ్చగొడుతోందని రాహుల్ ఆరోపించారు. నిజమైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలా చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని ఆరోపించారు. ఇకపై నేను ఒక్క మాట కూడా మాట్లాడను.. వాళ్ల పవర్ ఎంత ఉందో చూస్తా అని ఘాటుగా హెచ్చరించారు.