భార్యలు గెలిస్తే భర్తలతో ప్రమాణస్వీకారం చేయించారు!

మధ్యప్రదేశ్ లోని ఓ పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన మహిళలకు బదులు వాళ్ళ భర్తలు ప్రమాణ స్వీకారం చేసిన ఘటన కలకలంరేపింది. ఈ స‍ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Advertisement
Update:2022-08-06 07:06 IST

దేశంలో మహిళల పట్ల వివక్ష ఎలా కొనసాగుతోందో చెప్పే సంఘటన ఇది. రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉన్నా సరే గెలిచిన మహిళల భర్తలో, తండ్రులో, అన్నదమ్ములో, కుమారులో రాజ్యం చేస్తున్నారనడానికి మంచి ఉదహరణ ఇది.

మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలోని గైసాబాద్ పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఒక మహిళ సర్పంచ్ గా ఎన్నికయ్యింది, మరి కొందరు మహిళలు కూడా వార్డు మెంబర్లుగా ఎన్నికయ్యారు.

అయితే ప్రమాణ స్వీకార సమయంలో ఆ మహిళలకు బదులు వారి భర్తలు ప్రమాణస్వీకారం చేశారు. అధికారులు కూడా అందుకు అనుమతించడం గమనార్హం.

ఈ సంఘటన వివాదం కావడంతో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.

ఈ సంఘటనపై స్పందించిన‌ దామోహ్ పంచాయితీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అజయ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ...ఈ సంఘటన నిబంధనలకు విరుద్ధంగా కనిపిస్తోందని, విషయాన్ని పరిశీలించిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

" ఎన్నుకోబడిన మహిళ‌లకు బదులుగా కొంతమంది వారి భర్తలు ప్రమాణ స్వీకారం చేసినట్లు మాకు సమాచారం అందింది. ఈ విషయంపై మేము విచారణకు ఆదేశించాము. వివరణాత్మక నివేదిక వచ్చిన తర్వాత పంచాయతీ కార్యదర్శి దోషి అని తేలితే చర్యలు తీసుకుంటాము" అని శ్రీవాస్తవ చెప్పాడు.

ఇది ఒక్క మధ్య ప్రదేశ్ కు పరిమితమైన సమస్య కాదు దేశంలో అనేక చోట్ల మహిళా ప్రజా ప్రతినిధుల బదులు వాళ్ళ భర్తలే రాజ్యం చేస్తున్న దాఖలాలు కోకొల్లలు.

Tags:    
Advertisement

Similar News