బాబ్బాబ్ బ్బాబ్ బాబ్..
తనకింకా లాటరీ డబ్బులు రాలేదని, దానికి సమయం ఉందని చెబుతున్నాడు అనూప్. ఎక్కడికెళ్లినా జనం తన వెంట పడుతున్నారని, ప్రస్తుతం ఇంటి బయటకు వెళ్లేందుకు కూడా తనకు వీలు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
అతను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ సాయం చేస్తామంటూ ముందుకు రాలేదు, కనీసం అతని ఇబ్బందులేంటో కూడా అడిగే ప్రయత్నం చేయలేదు. బంధువులే కాదు, ఇరుగు పొరుగు వారు కూడా అతడ్ని పట్టించుకోలేదు. కానీ అతనికిప్పుడు 25కోట్ల రూపాయల లాటరీ తగిలింది. దీంతో అందరూ బంధువులైపోయారు. చుట్టుపక్కలవాళ్లు కూడా ఇప్పుడు అతని దగ్గరకు వస్తున్నారు. అతని సంతోషాన్ని పంచుకోడానికి అనుకుంటే మీరు పొరబడినట్టే. కేవలం సాయం అడగడానికి క్యూ కడుతున్నారు. పాతిక కోట్లు వచ్చాయి కదా, కనీసం మాకు పాతిక వేలు సాయం చేస్తే నీ సొమ్మేం పోతుందని నిలదీస్తున్నారట.
కేరళలోని ఆటో డ్రైవర్ అనూప్ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అతడికి ఓనమ్ లాటరీ తగిలింది. బతుకుదెరువుకోసం అరబ్ దేశాలకు వెళ్లిపోవాలనుకున్న టైమ్ లో అనుకోకుండా అతడికి లాటరీ తగిలింది. 25కోట్ల రూపాయల ప్రైజ్ మనీలో ట్యాక్స్ లు పోను 15.75కోట్ల రూపాయలు అతడికి వస్తాయని తేలిపోయింది. దీంతో అందరూ అతడిని చుట్టుముట్టారు. తమకు సాయం చేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. తెలిసినవారు, తెలియనివారు, అసలు అతడికి సంబంధమే లేనివారు కూడా ఆయన ఇంటి ముందు క్యూ కట్టారట. తిరువనంతపురంలో ఉన్న అతడి ఇంటికి ఎక్కడెక్కడినుంచో పేదవారు వచ్చి సాయంకోసం అభ్యర్థిస్తున్నారని స్థానిక మీడియా వెల్లడించింది.
డబ్బులు రాలేదు మొర్రో..
తనకింకా లాటరీ డబ్బులు రాలేదని, దానికి సమయం ఉందని చెబుతున్నాడు అనూప్. ఎక్కడికెళ్లినా జనం తన వెంట పడుతున్నారని, ప్రస్తుతం ఇంటి బయటకు వెళ్లేందుకు కూడా తనకు వీలు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. లాటరీ డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియదు కానీ, ఇప్పుడు పూట గడవడానికి ఆటో తీసేందుకు కూడా అతడికి అవకాశం లేదట. కొడుకు ఆరోగ్యం బాగోలేకపోతే కనీసం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కూడా ఇంటి బయట దారి వదలడంలేదని, తన ఇంటిని అందరూ చుట్టుముట్టేశారని చెబుతున్నాడు. సాయం అడగడంలో తప్పులేదు కానీ, మరీ ఇలా బెదిరించినట్టు, అందరూ ఒకేసారి ఇంటిని చుట్టుముడితే తాను ఏంచేయగలనని అంటున్నాడు అనూప్. డబ్బులు రావడం సంతోషంగానే ఉన్నా.. దానికంటే ముందుగా ప్రచారం ఎక్కువయ్యే సరికి ఇప్పుడు అనూప్ అనుకోని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.