షారుక్ ఖాన్ ఎవరో తెలియదన్న ముఖ్యమంత్రి... అర్దరాత్రి ఆయనకు ఫోన్ చేసిన బాలీవుడ్ హీరో
"బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ నాకు ఉదయం 2 గంటలకు కాల్ చేసారు. గౌహతిలో పట్హణంలో పఠాన్ మూవీ పోస్టర్లను చించేసిన సంఘటన గురించి ఆందోళన వ్యక్తం చేశారు.’’ అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు.
బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ పై వివాదాలు రేగిన విషయం తెలిసిందే. అందులోని బేషరమ్ పాటలో దీపికా పదుకొనే వేసుకున్న బికినీ కాషాయ రంగు ఉందంటూ మండిపడ్డ హిందూ సంఘాలు పఠాన్ మూవీని బైకాట్ చేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పలు చోట్ల నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం కలిగించాయి.
గౌహతిలో పఠాన్ మూవీ ప్రదర్శన జరగనున్న ఓ థియేటర్ పై కొందరు దాడి చేసి పఠాన్ పోస్టర్లను చించేసిన సంఘటనపై నిన్న జర్నలిస్టులు ముఖ్యమంత్రిని ప్రశ్నించినప్పుడు "షారుఖ్ ఖాన్ ఎవరు? నాకు అతని గురించి కానీ 'పఠాన్' చిత్రం గురించి కానీ ఏమీ తెలియదు," అని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. అంతే కాదు బాలీవుడ్ నుంచి తనకు చాలా మంది ఫోన్లు చేశారని కానీ మీరు చెప్తున్న ఆ షారుక్ ఖాన్ మాత్రం ఫోన్ చేయలేదని, ఫోన్ చేసి నాకు విజ్ఞప్తి చేస్తే అప్పుడు ఆలోచిద్దాం అన్నారు.
ముఖ్యమంత్రి ఇలా మాట్లాడిన కొన్ని గంటల్లోనే షారూక్ ఖాన్ ఆయనకు ఫోన్ చేశారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి శర్మ నే ట్వీట్ చేసి మరీ ప్రకటించారు.
"బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ నాకు ఉదయం 2 గంటలకు కాల్ చేసారు. గౌహతిలో పట్హణంలో పఠాన్ మూవీ పోస్టర్లను చించేసిన సంఘటన గురించి ఆందోళన వ్యక్తం చేశారు.’’ అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు. శాంతి భద్రతలను కాపాడటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని నేను అతనికి హామీ ఇచ్చాను. గౌహతి థియేటర్ సంఘటనపై మేము విచారిస్తాము. అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటానని ఆయనకు హామీ ఇచ్చాను అని ముఖ్యమంత్రి ట్వీట్‌లో పేర్కొన్నారు.