మతకలహాలు సృష్టించడానికి గోహత్య చేసిన హిందూ మహాసభ నాయకులు
సంజయ్ జాట్ తోపాటు బ్రిజేష్ భదౌరియా, సౌరభ్ శర్మ, అజయ్ లు ఆగ్రాలో ఓ గోవును చంపేసి మహమ్మద్ రిజ్వాన్, మహమ్మద్ నకీం, మహమ్మద్ షన్నులు గోహత్య చేశారని ప్రచారం చేశారు. ఈ గోహత్యపై జితేందర్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మతకలహాలు సృష్టించడానికి, కొందరు ముస్లింలతో ఉన్న తమ వ్యక్తిగత వైరాన్ని తీర్చుకోవడానికి హిందూ సభ నాయకులు గోహత్యకు పాల్పడి ఆ నేరాన్ని ముస్లింలపైకి తోసేశారు. ఈ కుట్రను ఉత్తరప్రదేశ్ పోలీసులు బహిర్గతపరిచారు.
ఆగ్రాలోని ఛట్టా ఏసీపీ ఆర్‌కే సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. గో హత్యలో అఖిల భారత హిందూ మహాసభ అధికార ప్రతినిధి సంజయ్ జాట్ ప్రధాన కుట్రదారు. అతడికి మహమ్మద్ రిజ్వాన్, ఆయన కుమారులు మహమ్మద్ నకీం, మహమ్మద్ షన్నుతో వ్యక్తిగత కక్ష ఉంది. శ్రీరామనవమి రోజు గోహత్య చేసి ఆ నేరాన్ని ఆ ముగ్గురిపైకి నెట్టాలని కుట్రపన్నాడు. పైగా మత భావాలు రెచ్చగొట్టి మతకలహాలు సృష్టించాలని కూడా ప్రణాళికలు రచించాడు.
సంజయ్ జాట్ తోపాటు బ్రిజేష్ భదౌరియా, సౌరభ్ శర్మ, అజయ్ లు ఆగ్రాలో ఓ గోవును చంపేసి మహమ్మద్ రిజ్వాన్, మహమ్మద్ నకీం, మహమ్మద్ షన్నులు గోహత్య చేశారని ప్రచారం చేశారు. ఈ గోహత్యపై జితేందర్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ హత్యపై విచారణ జరిపిన పోలీసులుకు మహమ్మద్ రిజ్వాన్, మహమ్మద్ నకీం, మహమ్మద్ షన్నులకు గోహత్య తో ఎలాంటి సంబంధం లేదని, బ్రిజేష్ భదౌరియా, సౌరభ్ శర్మ, అజయ్, సంజయ్ జాట్ లే ఈ హత్యకు పాల్పడ్డారని తేల్చారు.
ఈ సంఘటనపై ఆగ్రా పోలీస్ కమిషనర్ ప్రీతీందర్ సింగ్ మాట్లాడుతూ, ఇది పెద్ద పండుగకు ముందు మత విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నం అని అన్నారు. “ కొన్నిసార్లు ముఖ్యమైన పండుగలకు ముందు కొంతమంది ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే పరిస్థితిని సృష్టించడానికి ప్రయత్నిస్తారు. కానీ, ఈ సారి మతకలహాలు జరగలేదు'' అని ఆయన ప్రశ్నించారు.
సిసిటివి ఫుటేజీ, నిందితుల ఫోన్ లో ఒకరికొకరు రెగ్యులర్ గా మాట్లాడుకోవడం.. ఇంకా అనేక విషయాలపై సమగ్ర విచారణ ద్వారా కుట్ర వెల్లడయ్యిందని సింగ్ చెప్పారు.హిందూ మహాసభ నాయకుడైన సంజయ్ జాత్ కు నేర చరిత్ర ఉన్నదని ఆగ్రా పోలీసులు వెల్లడించారు.
ప్రస్తుత గోహత్య కేసులో, పోలీసులు నిందితులపై నేరపూరిత కుట్ర, మతపరమైన అల్లర్లకు ప్రేరేపణ, ఉత్తరప్రదేశ్‌లోని గోసంరక్షణ చట్టంలోని సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ సంజయ్ జాట్ మాత్రం పరారీలో ఉన్నాడు.