మీ దోపిడీకి జాతీయవాద ముసుగు తొడగొద్దు.. -అదానీపై మళ్లీ హిండెన్‌బర్గ్ అటాక్
అదానీ సంస్థ జాతీయవాదాన్ని అడ్డుపెట్టుకుని ఇచ్చిన వివరణపై హిండెన్‌బర్గ్ అంతే స్థాయిలో స్పందించింది. జాతీయవాదం పేరుతో మోసాన్ని దాచిపెట్టలేరంటూ కౌంటర్ ఇచ్చింది.
హిండెన్ బర్గ్ రిపోర్టు అదానీ సంస్థలకు, ఆయన స్నేహితులకు, ఇన్వెస్టర్లకు, నిధులు ధారపోసిన ప్రభుత్వ సంస్థలకు నిద్రలేకుండా చేస్తోంది. చివరకు ఏం చేయాలో తోచక అదానీ గ్రూప్ జాతీయ ముసుగు ధరించింది. అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడి దేశంలోని అమాయకులనే మోసం చేస్తోందని హిండెన్‌బర్గ్ చెప్పగా.. అదానీ గ్రూప్ మాత్రం ఇది మాపై దాడి కాదు.. దేశంపై దాడి అంటూ దేశ చిత్రపటం వెనుక దాక్కునే ప్రయత్నం చేసింది.
''ఇది ఒక కంపెనీపై దాడి కాదు.. భారత స్వతంత్రత, వృద్ధి, ఆశయాలపై కావాలని చేసిన దాడి'' అంటూ నిన్న అదానీ గ్రూప్ ఎదురుదాడి చేసింది. అదానీ సంస్థ జాతీయవాదాన్ని అడ్డుపెట్టుకుని ఇచ్చిన వివరణపై హిండెన్‌బర్గ్ అంతే స్థాయిలో స్పందించింది. జాతీయవాదం పేరుతో మోసాన్ని దాచిపెట్టలేరంటూ కౌంటర్ ఇచ్చింది.
కీలకమైన అంశాలను దారి మళ్లించేందుకే అదానీ గ్రూప్ ఇలా జాతీయవాద రాగం అందుకుందని విమర్శించింది. దీన్ని తాము అంగీకరించబోమని.. భారత్ ఒక శక్తివంతమైన, ఉజ్వల భవిష్యత్తు ఉన్న దేశం, భవిష్యత్తులో అగ్రరాజ్యంగా ఎదిగే సత్తా ఉన్న దేశంగా తామూ భావిస్తున్నామని చెప్పింది. కానీ జాతీయ వాదం ముసుగులో దేశాన్ని ఒక పద్దతి ప్రకారం దోచుకుంటున్న అదానీ గ్రూపే భారత దేశ అభివృద్ధికి అడ్డంకిగా మారిందని తాము భావిస్తున్నట్టు చెప్పింది. మోసం ఎవరు చేసినా అది మోసమే అవుతుందని.. సంపన్నులు చేసినంత మాత్రాన అది మోసం కాకుండా పోదని కామెంట్ చేసింది.
తమ నివేదికలో మొత్తం 82 సూటి ప్రశ్నలను సంధిస్తే.. ఇప్పటికీ అందులో కీలకమైన 62 ప్రశ్నలకు అసలు సమాధానమే చెప్పలేదని హిండెన్ బర్గ్‌ఎత్తిచూపింది. అటు సోమవారం కూడా అదానీ గ్రూప్ కంపెనీలు స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఒక్క అదానీ ఎంటర్‌ప్రైజెస్ మాత్రమే స్వల్ప లాభాల్లో ఉండగా.. అదానీ టోటల్ గ్యాస్ షేర్ 20 శాతం నష్టపోయింది. అదానీ ట్రాన్స్‌మిషన్ 20 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 17 శాతం, అదానీ పవర్ షేర్ 5 శాతం మేర నష్టపోయింది. కొన్ని కంపెనీలు మాత్రం స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి.
గత మంగళవారం నుంచి నేటి ఉదయం వరకు అదానీ గ్రూప్ సంపద దాదాపు రూ. 5.54 లక్షల కోట్లు ఆవిరైపోయింది.