50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్ .. సీఎం సంచలన ప్రకటన
ఇప్పుడు జార్ఖండ్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో కీలక నిర్ణయం తీసుకుంది. దళితులు, గిరిజనులకు 50 ఏళ్లకే పెన్షన్ అందజేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తాజాగా ప్రకటించారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సంచలన ప్రకటన చేశారు. దళితులు, గిరిజనులకు వృద్ధాప్య పింఛను అర్హత వయస్సును 60 నుంచి 50 ఏళ్లకు తగ్గించనున్నట్లు ప్రకటించారు. వృద్ధాప్య పెన్షన్ పెంపులో ఇటీవల పలు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చాలా రాష్ట్రాలు పెన్షన్ మొత్తాన్ని భారీగా పెంచాయి.
చాలా రాష్ట్రాల్లో కొన్నేళ్ల కిందటి వరకు రూ. వందల్లోనే పెన్షన్ ఇచ్చేవారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధులకు అందజేసే పెన్షన్ మొత్తం భారీగా పెరిగింది. ఏపీలో లబ్ధిదారులకు పెన్షన్ సొమ్ము పెంచిన తర్వాత చాలా రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు పెన్షన్ మొత్తాన్ని పెంచాయి. పెన్షన్ పెంపులో ఏపీని తెలంగాణ, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు అనుసరించాయి.
ఇప్పుడు జార్ఖండ్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో కీలక నిర్ణయం తీసుకుంది. దళితులు, గిరిజనులకు 50 ఏళ్లకే పెన్షన్ అందజేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తాజాగా ప్రకటించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జార్ఖండ్ లో గడిచిన 20 ఏళ్లలో గత ప్రభుత్వాలు కేవలం 20 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చాయని చెప్పారు. నాలుగేళ్లలోనే తమ ప్రభుత్వం 36 లక్షల 20 వేల మందికి పెన్షన్ ఇచ్చినట్లు తెలిపారు. సోరెన్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే దేశంలోనే తక్కువ వయస్సులోనే పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రంగా జార్ఖండ్ నిలవనుంది.