హేమంత్ సోరెన్‌ అరెస్టు..కొత్త సీఎంగా చంపాయ్‌ సోరెన్‌

హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో.. కొత్త సీఎంగా ఆయన సన్నిహితుడు చంపాయ్‌ సోరెన్‌ను ఎన్నుకున్నారు.

Advertisement
Update:2024-02-01 08:41 IST

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, JMM నేత హేమంత్‌ సోరెన్‌ను బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. భూ కుంభకోణం కేసులో దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించిన అనంతరం ఆయనను కస్టడీలోకి తీసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకూ 14 మంది అరెస్టయ్యారు. అరెస్టు అనంతరం హేమంత్‌ సోరెన్‌ను రాంచీలోని ఈడీ ఆఫీసుకు తరలించారు.

అంతకుముందు ఈడీ అధికారులతో కలిసి రాంచీలోని రాజ్‌భవన్‌కు వెళ్లిన హేమంత్ సోరెన్ గవర్నర్‌ను కలిసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా లేఖను సమర్పించారు. జార్ఖండ్ ఏర్పడిన నాటి నుంచి ఆరుగురు ముఖ్యమంత్రులు కాగా.. మూడు సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ఇక జార్ఖండ్ చరిత్రలో అరెస్టయిన మూడో ముఖ్యమంత్రిగా నిలిచారు హేమంత్ సోరెన్. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్, మధు కోడా అరెస్టయ్యారు. 2014-19 మధ్య బీజేపీ ముఖ్యమంత్రి రఘుబార్ దాస్‌ మాత్రమే పూర్తికాలం పదవీలో ముఖ్యమంత్రిగా కొనసాగారు.

హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో.. కొత్త సీఎంగా ఆయన సన్నిహితుడు చంపాయ్‌ సోరెన్‌ను ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఆయన హేమంత్ కేబినెట్‌లో రవాణాశాఖ మంత్రిగా ఉన్నారు. గవర్నర్‌ను కలిసిన చంపాయ్‌ సోరెన్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. జార్ఖండ్‌ అసెంబ్లీలో మొత్తం 81 మంది సభ్యులుండగా.. JMM నేతృత్వంలోని కూటమికి 48 మంది సభ్యుల బలం ఉంది. జేఎంఎంకు 29 మంది, కాంగ్రెస్‌కు 16 మంది ఎమ్మెల్యేలున్నారు.

హేమంత్ సోరెన్‌ 2013-14 మధ్య ఏడాది 168 రోజుల పాటు సీఎం పదవిలో ఉన్నారు. 2019 డిసెంబర్ 19న రెండో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన నాలుగేళ్ల 33 రోజులు పదవిలో కొనసాగారు.

Tags:    
Advertisement

Similar News