కశ్మీర్ లోయలో భారీగా మంచు వర్షం.. స్తంభించిన జనజీవనం
కశ్మీర్ లోయలోని పలురోడ్లపై మంచు గడ్డలు పేరుకుపోయాయి. దీంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. జమ్మూ - శ్రీనగర్, శ్రీనగర్ - లెహ్ సహా పలు జాతీయ రహదారులను, ప్రధాన రోడ్లను అధికారులు మూసివేశారు.
కశ్మీర్ లోయలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఎడతెరిపి లేకుండా మంచు వర్షం కురుస్తుండడంతో జనజీవనం స్తంభించిపోయింది. లోయలో ఎక్కడ చూసినా మంచు దిబ్బలే కనిపిస్తున్నాయి. భారీగా మంచు కురుస్తుండడంతో జనం ఇళ్లలో నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కొద్ది రోజులుగా వారు ఇళ్లకే పరిమితమయ్యారు. దుకాణాలు, మార్కెట్లు మూతపడ్డాయి. శ్రీనగర్, రాజౌరి, సోన్ మార్గ్, బందీపురా తదితర ప్రాంతాల్లో రోడ్లపై గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోయింది.
లోయలో భారీగా కురుస్తున్న మంచు కారణంగా రవాణా వ్యవస్థలు అందుబాటులో లేకుండా పోయాయి. కశ్మీర్ లోయలోని పలురోడ్లపై మంచు గడ్డలు పేరుకుపోయాయి. దీంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. జమ్మూ - శ్రీనగర్, శ్రీనగర్ - లెహ్ సహా పలు జాతీయ రహదారులను, ప్రధాన రోడ్లను అధికారులు మూసివేశారు.
పట్టాలపై భారీగా మంచు పేరుకుపోవడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు పట్టాలపై పేరుకుపోయిన మంచు గడ్డలను తొలగించే పనులు చేపట్టారు. తీవ్ర మంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. కొద్ది రోజులుగా భారీగా మంచు కురుస్తుండడంతో పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పీజీ, ఇంజనీరింగ్ పరీక్షలు జరగాల్సి ఉండగా ప్రభుత్వం వాటిని వాయిదా వేసింది.