మహారాష్ట్రలో జలవిలయం.. వరదనీటిలో ముంబై
మహారాష్ట్రలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముంబై, పుణె, ఠాణె, నాగ్ పూర్, షోలాపూర్ వంటి నగరాల్లోకి వరదనీరు చేరింది.
అటు దేశ రాజధాని ఢిల్లీ.. యమునా ప్రవాహానికి విలవిల్లాడుతోంది, ఇటు దేశ ఆర్థిక రాజధానిగా చెప్పుకునే ముంబై కూడా భారీ వర్షాలకు నీటమునిగే పరిస్థితి ఏర్పడింది. ముంబైలోని పలు ప్రాంతాల్లోకి వరదనీరు వచ్చి చేరింది. నిత్యం రద్దీగా ఉండే ముంబై-పుణె ఎక్స్ ప్రెస్ వే పైకి వరదనీరు చేరడంతో కొన్నిగంటలపాటు మూసివేయాల్సి వచ్చింది. పుణెలోని రెండు జాతీయ రహదారులపైకి కూడా నీరు చేరింది. భారీ వర్షాలకు మహారాష్ట్ర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మహారాష్ట్రలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముంబై, పుణె, ఠాణె, నాగ్ పూర్, షోలాపూర్ వంటి నగరాల్లోకి వరదనీరు చేరింది. ముంబైలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో మోటార్ల సాయంతో తోడి బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ముంబైతోపాటు రాయగఢ్ జిల్లాకు కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 24గంటలు గడిస్తే కానీ పరిస్థితి అంచనా వేయగలం అంటున్నారు అధికారులు.
విద్యాసంస్థలకు సెలవులు..
మహారాష్ట్రలో వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు నిరవధికంగా సెలవులు ప్రకటించారు. వర్షాలు తగ్గితే విద్యాశాఖ సమీక్ష చేపట్టి నిర్ణయం ప్రకటిస్తుందని చెబుతున్నారు. గత 24గంటల్లో ముంబైలోని కొలాబాలో అత్యధికంగా 232 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 101 నుంచి 147 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక్క రాయగఢ్ జిల్లా నుంచి ఏడువేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.